‘నీకోసం నిరీక్షణ’ గా కమల్ హాసన్, రజినికాంత్, శ్రీదేవిల అలనాటి క్లాసిక్
సరికొత్త హంగులతో ‘నీకోసం నిరీక్షణ’ గా కమల్ హాసన్, రజినికాంత్, శ్రీదేవిల అలనాటి క్లాసిక్ – నిర్మాత బామా రాజ్ కణ్ణు.
భారతీయ చలనచిత్ర రంగంలో నటదిగ్గజాలు అయినటువంటి యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అందాల తార శ్రీదేవి నటీనటులుగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం “పదినారు వయదినిలే`. 70వ దశకంలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల మన్ననలతో ఘనవిజయం సాధించి క్లాసిక్ మూవీగా నిలిచింది. తెలుగులో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్ర మోహన్, మోహన్ బాబులతో ‘పదహారేళ్ళ వయసు’ గా రూపొందించబడి సూపర్ హిట్ గా నిలిచింది. 42 సంవత్సరాల తర్వాత తమిళ “పదినారు వయదినిలే” చిత్ర నిర్మాత ఎస్ ఏ రాజ్ కణ్ణు కుమార్తె బామ రాజ్ కణ్ణు తమిళ వెర్షన్ ను అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంతరం మరో నాలుగు భాషల్లో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా..
నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ – “40 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నిర్మించిన క్లాసిక్ ను తెలుగు వారికి అందించాలనే నా ప్రయత్నమే `నీ కోసం నిరీక్షణ`. ఒక అరగంట నిడివి గల చిత్రాన్ని ఎడిట్ చేసి డబుల్ సెన్సార్ చేశాం. రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఈ చిత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా లానే ఉంటుంది. అయితే ` నీ కోసం నిరీక్షణ` క్లైమాక్స్ తెలుగు రీమేక్ `పదహారేళ్ళ వయసు` కి భిన్నంగా ఉంటుంది. కొత్త సంగీత దర్శకుడు కె. కె అందించిన 5 సరికొత్త పాటలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇళయరాజా గారి రీ- రికార్డింగ్ ను యధాతథంగా ఉపయోగించాం. ఈ చిత్ర డిజిటల్ రీ-స్టోరేషన్ ప్రాసెస్ కారణంగా డబ్బింగ్ చిత్రానికి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్లు ఎక్కువ అయింది. రజినీకాంత్ గారు ఆర్థికంగా సహాయం చేశారు. కరోనా కారణంగా ప్రివ్యూ వేయడం కుదరలేదు. వారికి స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నాం. ఒరిజినల్ నెగెటివ్ నుండి లాబ్ టెక్నీషియన్స్ ఒక్కో ఫ్రేమ్ ను జాగ్రతగా కలర్ ఎన్‌హ్యాన్స్ చేసి సినిమాస్కోప్ లోకి మార్చడం జరిగింది. ముగ్గురు ఆడియోగ్రాఫర్లు ఎంతో శ్రమించి సౌండ్ ను లేటెస్ట్ డాల్బీ 5.1 లో రికార్డ్ చేశారు. హీరో, విలన్ పాత్రలకు ఒక్కరే డబ్బింగ్ చెప్పినా అలా అనిపించదు. అంత బాగా చెప్పారు. మొదట ఈ చిత్రాన్ని 1000 థియేటర్లలో విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుత కరోనా కారణంగా డైరెక్ట్ గా ఆన్ లైన్లో విడుదల చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి..
సంగీతం : ఇళయరాజా,
నిర్మాత: బామా రాజ్ కణ్ణు,
దర్శకత్వం: భారతీరాజా.