తెలుగు

‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ పేరుతో మాస్క్‌లు తయారు చేయిస్తున్న లావణ్యా త్రిపాఠీ

By admin

June 24, 2020

‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ పేరుతో మాస్క్‌లు తయారు చేయిస్తున్న లావణ్యా త్రిపాఠీ

కరోనా (కొవిడ్ 19) కాలంలో ‘ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లు’ ధరించడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో ఈ ఏడాది మార్చి నుంచి స్టార్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ మాస్క్‌లు తయారు చేయిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి మాస్క్‌లను తీసుకువస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీలైనంత ఎక్కువ మందికి మాస్క్‌లు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకొనే ఆరోగ్య జాగ్రత్తలకు తమవంతు సహాయం అందిస్తున్నారు.

లావణ్యా త్రిపాఠీ మాట్లాడుతూ “లాక్‌డౌన్‌లో వెసులుబాటు దొరికిందని, నిబంధనలు సడలించారని మాస్క్‌లు ధరించడం మానవద్దు. కరోనాతో చేస్తున్న ఈ పోరాటంలో మీకు  బోర్ కొట్టి ఉండడవచ్చు. మీరు విసుగు చెంది ఉండవచ్చు. కానీ, కరోనా బోర్ కొట్టలేదు” అని అన్నారు.

‘గో లోకల్, బీ వోకల్’ అని ప్రజలు నినదిస్తున్న ప్రస్తుత తరుణంలో లోకల్ టాలెంట్ కి అవకాశం ఇస్తూ లావణ్యా త్రిపాఠీ తయారు చేయిస్తున్న ఈ మాస్క్‌లకు  డిమాండ్ బావుంది. టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలామంది ‘రెడ్‌ట్రీ’ మాస్క్‌లు ధరిస్తున్నారు.

‘రెడ్‌ట్రీ’ మాస్క్‌ల తయారీ ఎలా ప్రారంభమైందో లావణ్యా త్రిపాఠీ వివరిస్తూ “కరోనా కారణంగా మా టైలర్స్, మాస్టర్స్ కి మేం పెయిడ్ లీవ్స్ (వేతనంతో కూడిన సెలవులు) ఇచ్చాం. లాక్‌డౌన్ వల్ల ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందని వాళ్లు చెప్పారు. ఏ పని లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నామని చెప్పారు. వాళ్లకు సహాయ పడేలా ఏదైనా చేయాలని మాస్క్‌ల తయారీ ప్రారంభించాం. అటు మాస్క్‌లు కొనుక్కునే వాళ్లకు, ఇటు టైలర్స్ కి సహాయపడాలన్నది మా ఉద్దేశం. మాది నాన్ ప్రాఫిట్ వెంచర్” అని అన్నారు.

ప్రస్తుతం ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ పేరు మీద మాస్క్‌లు మాత్రమే తయారు చేస్తున్నప్పటికీ… భవిష్యత్తులో బ్రాండ్ పేరు మీద  మరిన్ని ఉత్పత్తులు తీసుకురావాలనే ప్రణాళికల్లో లావణ్యా త్రిపాఠీ, అనితా రెడ్డి ఉన్నారు.