తెలుగు

ఆగ‌స్టులో అందరూ ‘ఆహా’ అనాల్సిందే – అల్లు అర‌వింద్

By admin

August 14, 2020

ఆగ‌స్టులో అందరూ ‘ఆహా’ అనాల్సిందే – అల్లు అర‌వింద్‌

ప్ర‌స్తుత వినోద మాధ్యమాల్లో డిజిట‌ల్ మాధ్య‌మం కీల‌కంగా మారింది. వినోదానికి పెద్ద పీట వేసే తెలుగు ప్రేక్ష‌కులను డిఫ‌రెంట్ కంటెంట్‌ల‌తో ‘ఆహా’ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆక‌ట్టు కుంటూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా ఒక వైపు ‘సిన్, లాక్‌డ్, మస్తీస్, గీతా సుబ్రమణ్యం’ వంటి వెబ్ సిరీస్‌లు, మరో వైపు ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు అందించి ‘ఆహా’ అనిపించుకుంటోంది. ఆగ‌స్ట్  నెల‌ను పండుగ నెల‌గా ప్ర‌క‌టించింది. అందులో  భాగంగా స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ‘జోహార్‌’, ‘మెట్రోక‌థ‌లు’, ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్ప‌వీధి’ సినిమాల‌తో పాటు ‘ఆల్ ఈజ్ వెల్’ షోను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చింది. అందులో భాగంగా ఈ చిత్రాల్లో న‌టించిన స‌భ్యులు జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ముందుగా..

నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – ‘‘బయట ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే కోవిడ్ నుండి 2-3 నెల‌ల్లో బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నాను. ఇక నిర్మాత‌గా ప్ర‌తిరోజూ చాలా క‌థ‌లు వింటున్నాను. అయితే సినీ నిర్మాత‌గా ప్ర‌తి క‌థ‌ను తెర‌పైకి తీసుకురాలేం. కానీ ఆహా లాంటి ఓటీటీ వ‌ల్ల నిర్మాత‌గా ఎక్కువ కాన్సెప్ట్‌ల‌ను ప్ర‌జ‌ల‌కు చేర వేసే అవ‌కాశం క‌లుగుతుంది. కోవిడ్ 19 కార‌ణంగా సినిమా థియేట‌ర్స్‌కు ఏమైనా స‌మ‌స్య‌లుంటాయా? అని అడుగుతున్నారు. అయితే అంద‌రికీ నేను చెప్పేదొక్క‌టే. ఎప్ప‌టికైనా సినిమాను మించింది లేదు. ప్రేక్ష‌కుడికి సినిమా థియేట‌ర్‌లో కూర్చున్న‌ప్పుడు ఓ అద్భుత‌మైన ఫీలింగ్ క‌లుగుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ ఓపెన్ అయితే ఓవ‌ర్ ఫ్లో ఉండ‌దు. కానీ.. వ్యాక్సిన్ వ‌చ్చిన త‌ర్వాత ఫ్లో పెరుగుతుంది. ప్రేక్ష‌కుడు కంఫ‌ర్ట్‌గా థియేట‌ర్‌కు రావాలంటే వ్యాక్సిన్ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నాను. ఇక ఆహా విష‌యానికి వ‌స్తే.. ఈ నెల‌ను పండ‌గ నెల‌గా ప్ర‌క‌టించాం. ఆగ‌స్ట్ నెల‌లో స్వాతంత్ర్య దినోత్స‌వం, వినాయ‌క చ‌వితి పండ‌గ‌లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘జోహార్‌’, ‘మెట్రోక‌థ‌లు’, ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్ప‌వీధి’ సినిమాల‌తో పాటు ‘ఆల్ ఈజ్ వెల్’ షోను ప్లాన్ చేశాం. మా కంటెంట్‌తో అంద‌రూ ఆహా అనాల్సిందే. అలాగే ద‌స‌రా సంద‌ర్భంలోనూ ఫెస్టివ‌ల్ నెల‌ను ప్ర‌క‌టిస్తాం. కోవిడ్ స‌మ‌యంలో థియేట‌ర్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆహాకి ఆద‌ర‌ణ పెరిగింది. మంచి కంటెంటే మా స‌క్సెస్‌కు కార‌ణం. ఏడాదిన్న‌ర కాలంలో మేం రీచ్ కావాల‌నుకున్న టార్గెట్‌ను ఆరు నెల‌ల్లోనే రీచ్ అయ్యాం. ఈ ఆరు నెల‌ల కాలంలో ఆహా యాప్‌ను దాదాపు న‌ల‌బై ల‌క్ష‌ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. అలాగే ఈ ఆరు నెల‌ల కాలంలో ఆహా కంటెంట్ ఎలా ఉంద‌ని సెర్చ్ చేసిన వాళ్ల సంఖ్య కోటి ఇర‌వై ల‌క్ష‌లు. వ‌చ్చే ఏడాది ఇదే స‌మ‌యానికి రెండు, మూడు రెట్లు ప్రేక్ష‌కులు ఆహా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారని భావిస్తున్నాం. మంచి టీమ్ స‌హకారంతోనే ఈ టార్గెట్‌ను రీచ్ కాగ‌లిగాం.  ప్ర‌స్తుతం ఏటీటీల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. భ‌విష్య‌త్తులో ఏటీటీకి మంచి అవ‌కాశం ఉంటుంది. మేం కూడా భ‌విష్య‌త్తులో ఏటీటీలోకి అడుగు పెట్టే అవ‌కాశం ఉంది. దానికి సంబంధించిన రీసెర్చ్ జ‌రుగుతుంది. ఆహా నుండి 42 షోస్ ప్లానింగ్‌లో ఉన్నాయి.. వాటిలో వ‌చ్చే ఏడాది జూన్ కంతా వీలైన‌న్నీ షోస్‌ను రెడీ చేస్తాం. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. సెప్టెంబ‌ర్‌లో ఎక్కువ శాతం షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ ఏడాది పెద్ద సినిమాలు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌గానే క‌న‌ప‌డుతున్నాయి. రెండు, మూడేళ్ల‌లో పెద్ద పెద్ద స్టార్స్ ఓటీటీలోకి అడుగుపెట్టే అవ‌కాశాలున్నాయి. ఆహా కోసం మెగాస్టార్‌తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న‌కు కాన్సెప్ట్ న‌చ్చితే చాలు న‌టిస్తారు’’ అన్నారు.

మెట్రోకథలు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ మాట్లాడుతూ – ‘‘లాక్డౌన్ నుండి పరిష్మన్ దొరికిన తర్వాత కొన్ని విధి విధానాల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా ఉండే క‌థ‌ల‌ను ఎంచుకోవాలని అనుకున్న‌ప్పుడు క‌దిర్‌బాబుగారు రాసిన క‌థ‌ల నుండి నాలుగు క‌థ‌ల‌ను ఎంచుకుని ఈ యాంథాల‌జీ చేశాను. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా మంచి ఎమోష‌న్స్‌తో దీన్ని రూపొందించాం’’ అన్నారు.

సుమ క‌న‌కాల‌ మాట్లాడుతూ – ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు నేను గేమ్ షో ఇత‌ర‌త్రా చేశాను. వీటి వ్య‌వ‌థి గంట సేపు, గంట‌న్న‌ర సేపు ఉండేవి. కానీ తొలిసారి ఆల్ ఈజ్ వెల్ అనే కార్య‌క్ర‌మంతో జాతీయంగా, అంత‌ర్జాతీయం స‌మాజానికి సేవ చేస్తున్న వారి గురించి తెలియ‌జేస్తాం. చాలా మందికి తెలియ‌ని అన్ సంగ్ హీరోస్‌ను ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం’’ అన్నారు.

బుచ్చినాయుడు కండ్రిగ తూర్పువీధి ద‌ర్శ‌కుడు కృష్ణ మాట్లాడుతూ – ‘‘చిత్తూరు, నెల్లూరు జిల్లా మ‌ధ్య‌లోని బుచ్చినాయుడు కండ్రిగ అనే ఊరులోని తూర్పు వీధిలో జ‌రిగే ప్రేమ‌క‌థే మా చిత్రం. హీరో మున్నా ప‌ద‌వ త‌ర‌గ‌తి, డిగ్రీ, ఉద్యోగం చేసే యువ‌కుడు ఇలా మూడు ద‌శ‌ల్లోక‌నిపిస్తారు. రియాలిటీ ద‌గ్గ‌ర‌గా అంద‌రూ క‌నెక్ట్ అయ్యేలా దీన్ని తెర‌కెక్కించాం’’ అన్నారు.

రాజీవ్ కనకాల, గాయత్రి భార్గవి, అంకిత్ కొయ్య, ఎస్తర్, రవివర్మ, అలీ రెజా తదితరులు పాల్గొన్నారు.