తెలుగు

బాలీవుడ్ నటుడుసల్మాన్‌ ఖాన్ ను హత్యకు కుట్ర

By admin

August 19, 2020

బాలీవుడ్ నటుడుసల్మాన్‌ ఖాన్ ను హత్యకు కుట్ర

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు పన్నిన కుట్రను ఫరీదాబాద్ పోలీసులు ఛేదించారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠాలోని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. షార్ప్ షూటర్ రాహుల్ అలియాస్ సంగా అలియాస్ బాబాను ఉత్తరాఖండ్ లో ఈ నెల‌ 15 న ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ ను చంపే బాధ్యతను లారెన్స్ బిష్ణోయ్.. రాహుల్‌కు అప్పగించాడు. దాంతో రాహుల్ గత జనవరిలో ముంబై వెళ్ళాడు. అక్కడ బాంద్రాలోని సల్మాన్ ఖాన్ భవంతి దగ్గర మూడు రోజులు రెక్కీ నిర్వహించాడు. ఇలాఉండగా, ఫరీదాబాద్‌లో ఓ యువకుడి హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు జూన్ 24 న షార్ప్ షూటర్ రాహుల్ ఇంటికి చేరుకున్నారు.. ప్రవీణ్ అనే యువకుడిని రాహుల్ చంపగా.. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా పోలీసులు అరెస్టు చేశారు…

 

షార్ప్ షూటర్ రాహుల్ ను పోలీసులు ప్రశ్నించినప్పుడు.. సల్మాన్‌ ఖాన్ ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తేలింది. సల్మాన్ ఖాన్ హత్యకు రెక్కీ నిర్వహించేందుకు ముంబైకి వెళ్లడానికి జోధ్ పూర్ జైలులో ఉన్న పేరుమోసిన నేరగాడు లారెన్స్ బిష్ణోయ్.. తనకు సుపారీ ఇచ్చారని ఒప్పుకున్నట్లు తెలిసింది. కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌పై కోపం పెంచుకున్న లారెన్స్ బిష్ణోయ్ ఇంతకు ముందు చంపేస్తానని కూడా బెదిరించినట్లు సమాచారం. రాజస్థాన్ లోని బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను ఆరాధించడం దీని వెనుక ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కృష్ణ జింకలను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కేసుపై బిష్ణోయి సమాజం ఇప్పటికీ పోరాడుతున్నది. లారెన్స్ స్వయంగా బిష్నోయి సమాజం నుంచి వచ్చారు. అందువల్ల సల్మాన్‌కు లారెన్స్ శత్రుత్వం కలిగి ఉన్నాడు. 2018 జూన్ లో సల్మాన్ ఖాన్ రెక్కీని తన కుడిభుజంగా చెప్పుకునే సంపత్ నెహ్రాతో లారెన్స్ జరిపించినా.. అప్పుడు కూడా సల్మాన్ ఖాన్ ను చంపడం వీలుపడలేద‌ని పోలీసులు తెలిపారు.