తెలుగు

మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘జాంబీ రెడ్డి’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

By admin

August 21, 2020

మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘జాంబీ రెడ్డి’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

జాతీయ అవార్డు పొందిన అ! చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’. తొలి రెండు చిత్రాలు ‘అ!’, ‘క‌ల్కి’ల‌తో ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల మెప్పు పొందిన ఆయ‌న ఇప్పుడు నిజ జీవిత ఘ‌ట‌న‌లను ఆధారం చేసుకొని ‘జాంబీ రెడ్డి’ సినిమా రూపొందిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ లోగో పోస్ట‌ర్‌, హాలీవుడ్‌లో త‌యారైన వెన్ను జ‌ల‌ద‌రింప‌జేసే యానిమేష‌న్ పోస్ట‌ర్ ఆడియెన్స్‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం.

క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో క‌రోనా క‌నెక్ష‌న్‌తో ఈ సినిమాని తీస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌వ‌ర్మ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. క‌రోనాకీ, ‘జాంబీ రెడ్డి’కీ మ‌ధ్య క‌నెక్ష‌న్ ఏంటి?.. అనేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం.

కాగా ఆగ‌స్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ శుక్ర‌వారం చిత్ర బృందం ఒక మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో “వీరహ‌నుమాన్ నాట్య‌మండ‌లి” అనే బ్యాన‌ర్ క‌ట్టిన స్టేజ్, దాని ముందు అనేక‌మంది వైర‌స్ ఎఫెక్టెడ్ జాంబీస్ క‌నిపిస్తున్నారు. వాళ్ల ముందు చేతిలో గ‌ద ప‌ట్టుకొన్న హీరో మ‌న‌కు వీపు చూపిస్తుండ‌గా, అత‌ను ధ‌రించిన హుడీ వెనుక కోర‌ల్లాంటి ప‌ళ్ల‌తో జాంబీ వేషంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి బొమ్మ క‌నిపిస్తోంది. అది ‘దొంగ’ సినిమాలో హీరోయిన్‌ను రాధ‌ను టీజ్ చేస్తూ “కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో..” అంటూ పాడే పాట‌లో చిరంజీవి లుక్‌కు సంబంధించిన‌ది. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను బ‌ట్టి ఇది ఏ త‌ర‌హా సినిమానో మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా తెలుగులో మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్‌గా త‌యార‌వుతున్న ‘జాంబీ రెడ్డి’ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం త‌థ్య‌మ‌ని ముందుగానే నిర్ణ‌య‌మైపోయిన‌ట్లు క‌నిపిస్తోంది.

త్వ‌ర‌లోనే ‘జాంబీ రెడ్డి’లోని తారాగ‌ణం వివ‌రాలను చిత్ర బృందం వెల్ల‌డిస్తుంది.

సాంకేతిక బృందం: స్క్రీన్‌ప్లే: స‌్క్రిప్ట్స్‌విల్లే మ్యూజిక్‌: మార్క్ కె. రాబిన్‌ సినిమాటోగ్ర‌ఫీ: అనిత్‌ ఎడిటింగ్‌: సాయిబాబు ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర తంగ‌ల‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ కుమార్ జెట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ఆనంద్ పెనుమ‌త్స‌, ప్ర‌భ చింత‌ల‌పాటి నిర్మాత‌: రాజ్‌శేఖ‌ర్ వ‌ర్మ‌ ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ వ‌ర్మ‌ బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ స్టూడియోస్‌