తమిళ స్టార్ సూర్యకి అశ్వనీదత్ మద్దతు
ప్రముఖ దర్శకుడు అశ్వనీదత్ తమిళ స్టార్ నటుడు సూర్యకి మద్దతునిచ్చారు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితకథ ఆధారంగా సూర్య నటిస్తున్న చిత్రం `ఆకాశం నీ హద్దురా` (తమిళంలో `సూరారై పొట్రు`). ఈ సినిమాను సూర్య స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే అవకాశాలు లేకపోవడం వల్లే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై సీనియర్ డైరెక్టర్ హరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా సూర్యకు హరి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సూర్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ సమర్థించారు. `వచ్చే జనవరి వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఆ తర్వాత కూడా ఎలా ఉంటుందనేది అర్థం కాని పరిస్థితి. సినిమాలను థియేటర్లలోనే విడుదల చేస్తాం, అందరూ అక్కడే చూడండి అని ప్రజల ఆరోగ్యాలతో, వారి ప్రాణాలతో ఆటలాడటం చాలా తప్పు. `ఆకాశం నీ హద్దురా` చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్న సూర్య నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. `వి` సినిమా తనకు మైలురాయి లాంటి 25వ చిత్రమైనప్పటికీ, నేటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓటీటీలో విడుదల చేయడానికి నాని అంగీకరించడం అభినందనీయం. డైరెక్టర్ హరి సినిమాలకు నేను అభిమానిని. ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాల్సిందిగా హరిని నేను కోరుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అశ్వనీదత్ చెప్పారు.