తెలుగు

కరోనా ప్రభావంతో సినీరంగంలో పెనుమార్పులు

By admin

August 30, 2020

కరోనా ప్రభావంతో సినీరంగంలో పెనుమార్పులు

కరోనా ప్రభావం తగ్గిన అనంతరం భారత సినీరంగంలో పెనుమార్పులొచ్చే అవకాశాలు స్పష్టమౌతున్నాయి. ఇప్పటికే బాలివుడ్‌ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌ఉడ్‌, మాలీవుడ్‌ల వరకు 60ఏళ్ళ పైబడ్డ హీరోలే కీలకంగా ఉన్నారు. వీరితో వందల కోట్ల పెట్టుబడుల్తో చిత్రాలు నిర్మిస్తున్నారు. అవి అదే స్థాయిలో రాబడి సాధిస్తున్నాయి. అయితే గత ఆరుమాసాలుగా దేశంలో షూటింగ్‌లు మూతబడ్డాయి. తిరిగెప్పుడు మొదలౌతాయో తెలీని పరిస్థితి. మొదలైనా సీనియర్‌లు షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. షూటింగ్‌లు జరిగినా తిరిగి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టతలేదు. థియేటర్లు తెరిచినా గతంలోలా పెద్దసంఖ్యలో ప్రేక్షకులొచ్చి సినిమాల్ని థియేటర్లో చూస్తారన్న ఆశాభావం కూడాలేదు. ఈ నేపధ్యంలో తిరిగి రెండుమూడేళ్ళ వరకు సినీ పరిశ్రమల పుంజుకోదని పరిశీలకులు అంచనాలేస్తున్నారు. ఇది పరిశ్రమ తీరుతెన్నుల్లో పెనుమార్పులకు దారితీయెచ్చు. ఇప్పటికే 60ఏళ్ళు నిండిన ప్రముఖ తెలుగుహీరో వెంకటేష్‌ తాను చిత్రాల్నుంచి నెమ్మదిగా వైదొలిగి తన స్థానంలో కుమారుడ్ని ఆరంగేట్రం చేయిస్తానంటూ ప్రకటించారు. అలాగే తెలుగులో చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్లు తమ వారసుల్ని తెరమీదకు తెచ్చారు. మరో సీనియర్‌ బాలకృష్ణ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. అలాగే మోహన్‌బాబు ఇప్పటికే తన ముగ్గురు సంతానాన్ని సినీపరిశ్రమలోకి దింపారు. తమిళనాట రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, ప్రభుల వారసులు వివిధ విభాగాల్లో తమ కుటుంబ పట్టు నిలుపుకున్నారు. మరో హీరో విక్రమ్‌ కూడా ఇటీవలె కుమారుడ్ని హీరోగా పరిచయం చేశారు. మళయాళీ ప్రముఖ నటుడు మమ్ముట్టి కుమారుడు హీరోగా విజయపధాన దూసుకుపోతుంటే మరో సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కుమార్తె ఈ రంగంలో తన ముద్రవేసింది. కన్నడలో అనంతనాగ్‌, రవిచంద్రన్‌, శశికుమార్‌లు తమ వారసుల్ని రంగప్రవేశం చేయించారు. హిందీలో అమితాబ్‌ నుంచి ప్రధాన హీరోల పుత్రుల్తో పాటు కుమార్తెలు కూడా తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అలాగే వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా తమ వారసుల్ని పరి చయం చేస్తున్నారు. ఇప్పటికే ఆరుపదుల వయసు దాటిన హీరోలు కరోనా నేపధ్యంలో ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతిచ్చినా ఇప్పట్లో తాము హాజరయ్యేది లేదని తేల్చిచెప్పేశారు. వాస్తవానికి వీరు హీరోలుగా నిర్మిస్తున్న చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే వీటిపై వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. అయినప్పటికీ కరోనా విషయంలోవీరెవరూ సాహసాలు చేయడంలేదు. దీంతో ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాల నిర్మాణం పూర్తయ్యేందుకు కనీసం రెండుమూడేళ్ళు పడుతుంది. దీంతో ఇక ముందు వీరంతా సినీ జగత్తును తమ వారసులకు కట్టబెట్టి విశ్రాంత జీవితం గడిపే ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు అంచనాలేస్తున్నారు. గతంలో రేలంగి, సావిత్రి వంటి నటులు ఎంతగా సంపాదించినా చివరి దశకొచ్చేసరికి ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు. కానీ ప్రస్తుతం హీరోల్నుంచి చిత్రసీమలోని వారెవరికీ ఇటువంటి పరిస్థితుల్లేవు. వీరంతా ముందుజాగ్రత్తతోనే ఉన్నారు. దీంతో ఇక విశ్రాంతి జీవితం గడిపినప్పటికీ ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి తలెత్తదు. ఇంతకాలం వీలైనన్ని సినిమాలు చేశారు. వీలైనంతగా ప్రజల్ని ఆలరించారు. ఇక తమ శరీరాలకు సుఖాన్నివ్వాలని వీరు అభిలషిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రెండుమూడేళ్ళ అనంతరం ప్రేక్షకుల ఆలోచనల్లో కూడా మార్పులొచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వివిధ పరి ణామాలు వారిపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ప్రస్తుత చిత్ర కథాంశాలకు భిన్నంగా కొత్త దనాన్ని ఆశిస్తారు. పాతతరం స్థానంలో విభిన్న నటనను కోరుకుంటారు. ఇది కూడా సీనియర్‌ నటులు నెమ్మదిగా తెరమరుగై వారసుల్ని తెరపైకి తెచ్చేందుకు చేసే ప్రయత్నాలకు ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు.