ప్రభాస్, నాగ్ అశ్విన్ పాన్ ఇండియా ఫిల్మ్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా సింగీతం శ్రీనివాసరావు
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, ప్రామిసింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఎపిక్ ఫిల్మ్‌కు పనిచేయడానికి పలువురు క్రియేటివ్ పీపుల్ ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ను వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ దీపికా పడుకోనే ఇప్పటికే ఎంపికయ్యారు. మరో ఆసక్తికరమైన విషయమేమంటే తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ సినిమాపై పనిచేస్తున్న సింగీతం.. క్వారంటైన్ పీరియడ్‌లోనూ చిత్ర బృందంతోనే ఉంటున్నారు.
“సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నిజమవుతోంది. మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్‌పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది.” అని సోషల్ మీడియా ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది.
సైన్స్ ఫిక్షన్ జానర్‌కు చెందిన ఈ ఫిల్మ్.. ప్రొడక్షన్‌లో ఉన్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటనేది నిస్సందేహం.
లార్జర్ దేన్ లైఫ్ మూవీస్‌తో, భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మించే చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ ఈ ఎపిక్ ఫిల్మ్‌ను మరింత భారీ వ్యయంతో, దేశవ్యాప్తంగా పేరుపొందిన తారాగణంతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.