గొప్ప భారతీయుల్లో ఒకరైన ఉమా ప్రేమన్ జీవితంపై బయోపిక్
ఒక సాధారణ మిల్లు కార్మికుని ఇంట్లో పుట్టి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఉమా ప్రేమన్ జీవిత గాథ బయోపిక్‌గా రాబోతోంది.
దాదాపు 2 లక్షల డయాలసిస్‌లు, 20 వేలకు మించిన గుండె శస్త్ర చికిత్సలు, వందలాడి కిడ్నీ మార్పిడులు, గిరిజనుల కోసం పాఠశాలలు, తక్కువ ఖర్చుతో ఇళ్లు.. వంటివి ఉమా ప్రేమన్ చేసిన సేవల్లో కొన్ని. ఈ సేవలతో దేశంలోని ఎంతోమంది నిరుపేదల జీవితాలను ఆమె మార్చేశారు. అంతేకాదు, దేశంలోనే ఆమె మొట్టమొదటి పరోపకార మూత్రపిండ దాత.
తనకు ఏమాత్రమూ తెలీని ఓ టీనేజర్‌కు ఉమా ప్రేమన్ తన కిడ్నీని దానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా రియల్ హీరో అవార్డు అందుకున్న మహిళల్లో ఆమె ఒకరు. అటువంటి అసాధారణ మహిళ జీవితం త్వరలో బహు భాషా బయోపిక్‌గా రూపొందనున్నది.
‘ట్రాఫిక్ రామసామి’ ఫేమ్ విఘ్నేశ్వరన్ విజయన్ ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. దర్శకుడు విఘ్నేశ్వరన్ విజయన్ మాట్లాడుతూ, “నిస్వార్థప్రేమను మించిన గొప్ప విషయం మరొకటి లేదు. తన చుట్టూ ఉన్నవాళ్లు బాధపెట్టినప్పుడల్లా వారికి ఉమా ప్రేమన్ మరింత ప్రేమను సమాధానంగా ఇచ్చేవారు. పలువురికి ఈ సినిమా స్ఫూర్తిదాయకం అవుతుందని నేను నమ్ముతున్నాను. నిస్పృహతో ఉన్న యువత ఈ సినిమా చూస్తే, ఒక సాధారణ అమ్మాయి ఎలా అడ్డంకుల్ని అధిగమించి, ఈ ప్రపంచంలో తనదైన ముద్రను ఎలా వేసిందో తెలుస్తుంది” అన్నారు.
ఈ ఉద్వేగభరిత, వినోదాత్మక ఫిమేల్ సెంట్రిక్ బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లతో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోంది. ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.