“ప్రణవం” మూవీ రివ్యూ
బేనర్ః చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్
నటీనటులుః శ్రీ మంగం, శశాంక్, జెమిని సురేష్, అవంతిక, గాయత్రి అయ్యర్
నిర్మాతః తను ఎస్
దర్శకత్వంః కుమార్ జి
సంగీతంః పద్మనావ్ భరద్వాజ్
ఎడిటర్: సంతోష్
ఫైట్స్: దేవరాజ్
రిలీజ్ డేట్ః 5-2-21
రేటింగ్ః3 /5
`ఈ రోజుల్లో` లాంటి ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ మంగం. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా వర్కవుట్ కాలేదు. ఇటీవల రీ-ఎంట్రీ ఇస్తూ ప్రణవం చిత్రంలో నటించాడు. తనకిది మంచి పునఃప్రారంభం అవుతుందన్న ధీమాతో ఉన్నాడు శ్రీ. మరి ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. రివ్యూ ఒకసారి చూద్దాం.
కథాంశంః
కార్తిక్ (శ్రీ) , జాను (అవంతిక)ను తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీస్తుంది. ఇలా హ్యాపీగా వీరి లైఫ్ సాగిపోతున్న క్రమంలో ఒక అమ్మాయి వీరి జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత కార్తిక్ భార్య జాను మిస్సవుతుంది. అసలు కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరు? ఆమెకు కార్తిక్ కి సంబంధం ఏంటి? జాను మిస్సింగ్ వెనక ఉన్న హస్తం ఎవరది అన్నది చిత్ర కథాంశం.
ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ః
ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ గా , అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న హీరోలా శ్రీ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా తన పాత్ర ఇంట్రవెల్ కి ముందు నెగిటివ్ షేడ్ లో ఉంటుంది. నెగిటివ్ పాత్రలో కూడా శ్రీ రాణించగలడు అనే విధంగా నటించాడు. ఇక శశాంక్ పాత్ర డిఫరెంట్ గా డిజైన్ చేశాడు దర్శకుడు. అలాగే స్టైలిష్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా జెమిని సురేష్ ఇంతకు ముందెన్నడు నటించిన విధంగా నటించాడు. అలాగే మరో పోలీస్ ఆఫీసర్ గా నవీన రెడ్డి నటన ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ దొరబాబు కనిపించింది ఒకే ఒక సీన్ లో అయినా నవ్వులు పూయించాడు.
సినిమా బలంః
లవ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలకు సంగీతం, సినిమాటో్గ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ సినిమాకు పద్మనావ్ భరద్వాజ్ అందించిన మూడు పాటలతో పాటు నేపథ్య సంగీతం చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా ఆర్ పి పట్నాయక్, ఉష కలిసి పాడిన పాట థియేటర్ లో చూడటానికి వినడానికి బావుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా కథ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఇక ఈ సినిమా విషయంలో మెయిన్ గా చెప్పాలంటే దర్శకుడు ఎన్నుకున్న కథ , కథనాలు సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఒక మంచి కథను ఎన్నుకోవడమే కాకుండా దానికి తగ్గ స్ర్కీన్ ప్లే రాసుకున్నాడు. ఫస్ట్ టైమ్ సినిమా డైరక్టర్ లా కాకుండా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా డీల్ చేశాడు. ఇక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా కథకు కావాల్సిన బడ్జెట్ పెట్టి సినిమా క్వాలిటీగా రావడానికి సహకరించారు.
విశ్లేషణలోకి వెళితే…
ముందుగా ఒక మర్డర్ చూపించి …దాన్ని హీరో పైకి వచ్చేలా క్రియేట్ చేసి ఆ తర్వాత కథ లోకి తీసుకుళ్లడం అనేది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. టూ మచ్ లవ్ కూడా ప్రమాదకరమే అని గాయత్రి అనే అమ్మాయి క్యారక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. కొన్ని సార్లు పరిస్థితులు మనల్ని విలన్ గా, హీరోగా మారుస్తుంటాయి అని హీరో శ్రీ క్యారక్టర్ లో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్టాప్ అంతా లవ్ స్టోరీ ఎంటర్ టై న్ మెంట్ తో సాగుతూనే, సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ తో ఇంట్రస్టింగ్ గా సినిమాను తీసుకెళ్లాడు. కథతో పాటు టైట్ స్ర్క్రీన్ ప్లే తో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. కార్తిక్ భార్య గా అవంతిక పర్వాలేదనిపించినా ఇంపార్టెంట్ పాత్రలో నటించిన గాయత్రి తన పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయింది. తన స్థానంలో ఇంకా మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకోవాల్సింది. డైలాగ్స్ కొన్ని బాగున్నప్పటికీ ఫస్టాప్ లో కామెడీ మాత్రం తగ్గింది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ దర్శకుడు తన స్ర్కీన్ ప్లే, అంతర్లీనంగా ఇచ్చిన సందేశంతో ప్రణవం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంటుంది.