దేవినేని సినిమా డైరెక్టర్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు..
కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ గారిది ఎంతో ప్రత్యేకత ఉంది.. బెజవాడలో రాజకీయాలను ఆయన శాసించారు. నెహ్రూ కనుసైగ చేస్తే బెజవాడ.. కేకవేస్తే ప్రత్యర్ధుల్ని ఉలిక్కిపడేలా చేసేది. మూడున్నర దశాబ్దాల పాటు తన మాటలతో, చేతలతో బెజవాడ రాజకీయాలను శాసించారు. కొత్తతరం లీడర్లు పుట్టుకొచ్చినా, బెజవాడపై నెహ్రూ పట్టు మాత్రం తప్పలేదు. అయితే దేవినేని నెహ్రూ జీవిత ఆధారంగా దేవినేని చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు నర్రా శివ నాగు డైరెక్షన్ చేయగా, నందమూరి తారకరత్న టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు బెజవాడ సింహం అంటూ ట్యాగ్‌లైన్ పెట్టారు చిత్రబృందం. అయితే ఈ సినిమాపై కొంతమంది బెజవాడ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మా అనుమతి లేకుండా తీశారని, వెంటనే ఈ సినిమాను నిలిపివేయాలని తెలుపుతూ.. చిత్ర నిర్మాతలు జిఎస్ఆర్, రాము రాథోడ్, అలాగే దర్శకుడు శివ నాగుపై కొంతమంది ఏపీ రాజకీయ నాయకులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు శివ నాగుపై ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ క్రమంలో ఈ చిత్ర దర్శక నిర్మాతలపై ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో.. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఈ చిత్ర దర్శకలు శివ నాగు ఈ చిత్రంపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ చిత్రంలో వంగవీటి రాధ పాత్రలో ప్రముఖ నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేశ్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో టీఎఫ్‌పీసీ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం బెజవాడలో ఇద్దరు మహానాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబం నేపథ్యంలో సెంటిమెంట్ కలయికలో తెరకెక్కిస్తున్నట్లు ఈ చిత్ర దర్శకడు శివ నాగు గతంలోనే వెల్లడించాడు.