ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం రైతన్న. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: రైతన్న సినిమా డబ్బింగ్,ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు అయిపోయాయి. ప్రస్తుతం డి ఐ కార్యక్రమాలు జరుగుతున్నాయి.మరొక వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకొని వచ్చింది. అవి రైతులకు వరాలు కావు.మరణ శాసనాలు.పంజాబ్ హర్యానా, బీహార్, మహారాష్ట్ర, మరియు దక్షిణాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలను రద్దుచేయాలని స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను అమలు చేయాలని పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమి చెపుతుంది అంటే ప్రస్తుత ప్రపంచీకరణ దశలో మన రైతాంగానికి ఈ కొత్త చట్టాలు మేలు చేస్తాయని అంటుంది. సవరణలు చేస్తాము కానీ రద్దు మాత్రం చెయ్యము అని అంటున్నారు. అయితే రైతులు…మాకు సవరణలు వద్దు చట్టాలను రద్దు చేయాల్సిందే అని పోరాటం చేస్తున్నారు. ఒక కళా కారుడిగా నేను కేంద్ర ప్రభుత్వానికీ నరేంద్ర మోడి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.రైతులంటే మీకు ఎంతో గౌరవం అని చెప్పారు.ఆ రైతుల పట్ల మీకు అంత గౌరవం వుంటే మీరు తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను .ఎకరం భూమి దున్నడం రాని వారు,నాగేటి సాలల్లో రైతులు విత్తనాలు ఎలా జల్లుతున్నారో తెలియని వారు, ఒక బస్తా ధాన్యం పండించడం ఎరుగని వారు అంతా రైతులతో చర్చించ కుండా ఈ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని వచ్చారు.అందుకే వీటిని రద్దు చేయమంటున్నాము. ఈ నేపథ్యంలో చేసిన సినిమా నే రైతన్న అని అన్నారు