ఆఫ్టర్ కరోనా విదేశాల్లో షూటింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ `సర్కారువారి పాట` సినిమా కోసం దుబాయ్ లో షూటింగ్ చేశారు. మరో షెడ్యూల్ కూడా అక్కడ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ బడ్జెట్ , పెద్ద స్టార్స్ చిత్రాల నిర్మాతలే విదేశాల్లో షూటింగ్స్ చేయాలంటే భయపడుతోన్న క్రమంలో ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్న సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా ఎంపిక చేసుకుని సురేష్ అనే నూతన దర్శకుడుతో సినిమా చేస్తూ దుబాయ్ లో షూటింగ్ చేశారంటే కచ్చితంగా ఆ నిర్మాతకు గట్స్ అయినా అయి ఉండాలి లేదా కథ మీద ,ఆ దర్శకుడి మీదైనా నమ్మకం అయి ఉండాలి. గతంలో వరుణ్ సందేశ్ తో `ప్రియుడు` అనే చిత్రాన్ని నిర్మించిన పి.ఉదయ్ కిరణ్ కొంత గ్యాప్ తర్వాత హిమాలయ స్టూడియో మేన్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ `1 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ఇటీవల మూడు పాటలు దుబాయ్‌లో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కి సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో షూటింగ్ పార్ట్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్ , టైటిల్ రివీల్ చేయనున్నారు. గతంలో జయంత్ సి.పరాన్జీ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వలో పని చేసిన సురేష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిని నమ్మి పూర్తి స్వేఛ్చనిస్తే కచ్చితంగా మంచి చిత్రాలు వస్తాయని గతంలో ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. ఈ కోవలో ఈ సినిమా కూడా దర్శకుడికి పూర్తి స్వేఛ్చనిచ్చి తీసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ నిర్మాతకు మంచి జరగి మరెన్నో సినిమాలు నిర్మించే అవకాశాలు రావాలని కోరుకుందాం.