యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది – యంగ్ హీరో అభయ్ సింహా
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు “క్రష్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు యంగ్ హీరో అభయ్ సింహా. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “క్రష్” మూవీ ఇటీవలే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం అభయ్ సింహా నటిస్తున్న “కమిట్ మెంట్” అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తన తొలి సినిమా “క్రష్” ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హీరో అభయ్ సింహా మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు.
హీరో అభయ్ సింహా మాట్లాడుతూ…మా నాన్న సతీష్ గారు హీరోగా “నెల్లూరి పెద్దారెడ్డి” వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన ఇన్సిపిరేషన్ తో నేనూ హీరో కావాలని అనుకున్నాను. డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రవిబాబు గారు క్రష్ మూవీకి ఆడిషన్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆడిషన్ లో సెలెక్ట్ అవడంతో ఆ మూవీలో హీరోగా నటించే అవకాశం దక్కింది. ఫస్ట్ మూవీనే రవిబాబు గారు లాంటి క్రియేటర్ దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా మేకింగ్ మీద కంప్లీట్ అవగాహన ఉన్న దర్శకుడు రవిబాబు గారు. ఆయన సెట్ కు రావడమే ఎడిటింగ్ మోడ్ లో వస్తారు. చకచకా సీన్స్ చేసేస్తుంటారు. క్రష్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక నాకు మంచి పేరొచ్చింది. రొమాంటిక్ మూవీ కాబట్టి యూత్ ఆడియన్స్ ఎక్కువగా చూశారు. బయటకు తెలియకున్నా చాలా మంది రొమాంటిక్ మూవీస్ చూసేందుకు ఇష్టపడతారు. ఆన్ కెమెరా రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఇబ్బంది పడలేదు. నటించేందుకు సిద్ధమైనప్పుడే సిగ్గుపడటం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. క్రష్ రొమాంటిక్ మూవీ అయినా కథలో అది భాగమే. కమిట్ మెంట్ మూవీలో వివిధ కథలు కలిసి ఉంటాయి. ఆంథాలజీ మూవీ అనుకోవచ్చు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కు యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని షేడ్స్ ఉంటాయి. నాకు ఎన్టీఆర్ నటన చాలా ఇష్టం. ఆయనలా మాస్, యాక్షన్ హీరో లా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాను. వాటిలో “సలీం అక్బర్ అనార్కలి” అనే మూవీ ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. మిగతా రెండు చిత్రాలు కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొస్తాం. అన్నారు.