సినిమాలపై ఉండే ప్యాషన్, ప్రేక్షకుల ఆశీర్వాదంతో హీరోగా రాణిస్తాను: `రెడ్డిగారింట్లో రౌడీయిజం` హీరో రమణ్
సినిమాలంటే ఆసక్తిలేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే సినీ రంగంలోకి ప్రవేశించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసేవాళ్లు మరి తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో హీరో రమణ్ ఒకరు. చిన్నప్పట్నుంచి సినిమాలపై ఉండే ప్యాషన్‌తో రియల్ ఎస్టేట్ రంగం నుంచి సినీ ఫీల్డ్‌లో అడుగుపెట్టి కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడానికి రమణ్ చేస్తున్న ప్రయత్నమే `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఆసక్తికరమైన విషయమేమంటే, తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడే మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండటమే. హీరోగా నేనెంటో ప్రూవ్ చేసుకోవడమే లక్ష్యమంటున్న రమణ్ పుట్టినరోజు ఆగస్ట్ 10. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….
“మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని ఎద్దులాయపల్లి గ్రామం. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి. మెగాస్టార్ చిరంజీవిగారి సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. అయితే చదువుకివ్వాల్సిన ప్రాధాన్యత తెలుసు. కాబట్టే లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత నటనపై ఫోకస్ చేయాలని అనుకున్నాను. అలా చదువు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. అక్కడ సక్సెస్ అయిన తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టాను. సిరి మూవీస్ బ్యానర్‌ను పెట్టి తొలి చిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం` సినిమా చేశాను. సినిమా చేయాలనుకున్న తర్వాత సత్యం యాబీ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. సినిమా రంగం గురించి తెలియదు. ఎవరి అండ దండలు లేవు. పెద్దగా ఆదరణ ఉండదేమో భయాలను కలిగించే ప్రయత్నం చేసినా, సినిమా అంటే ఉండే పిచ్చితో ధైర్యంగా ముందడుగు వేశాను. అయితే ఇక్కడెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. నన్ను ఆదరించారు. తొలి ప్రయత్నంగా `రెడ్డిగారింట్లో రౌడీయిజం` సినిమాను పూర్తి చేశాం. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంచి సినిమా తీశానని అభినందిచడంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎం. రమేష్, గోపి సినిమాను చక్కగా తెరకెక్కించారు. మహిత్ నారాయణగారు సంగీతం, శ్రీవసంత్ నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. కెమెరామెన్ ఎ.కె.ఆనంద్‌గారు సన్నివేశాలను చక్కగా విజువలైజ్ చేశారు.
సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మంచి రిలీజ్ డేట్ చూసుకుని సినిమాను విడుదల చేస్తాం. సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ మా సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అలాగే సీనియర్ నటుడు వినోద్ కుమార్‌గారు విలన్‌గా చేశారు. ఆయనతో నటించే సమయంలో నటుడిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. అలాగే తొలి ప్రయత్నంలో నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే మా సినిమా టీజర్‌ను వి.వి.వినాయక్‌గారు విడుదల చేస్తే ఓ సాంగ్‌ను వై.ఎస్.షర్మిలగారు, మరో సాంగ్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేసి అప్రిషియేట్ చేయడం మరచిపోలేని ఆనందాన్నిచ్చింది. హీరో కావాలనుకోవడం ఎంతో మంది కల. ఆ దేవుడి దయ, సినీ కళామతల్లి ఆశీర్వాదంతో అది నిజమైంది. ఇప్పుడు `రెడ్డిగారింట్లో రౌడీయిజం` విడుదల సిద్ధంగా ఉండగానే మరో రెండు సినిమాలు చేస్తున్నాను. నేను హీరోగా యాక్ట్ చేస్తున్న రెండో సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే ఓ పాన్ ఇండియా మూవీని కూడా చర్చల దశలో ఉంది. హీరోగా నన్ను ఎంకరేజ్ చేయాలని తెలుగు సినీ ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
`రెడ్డిగారింట్లో రౌడీయిజం`.. చిత్రాన్ని సిరి మూవీస్ బ్యానర్‌పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మించిన చిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు.