Vikrant Rona Movie Pre Release Event
బాహుబలి, RRRలా ‘విక్రాంత్ రోణ’ పెద్ద సూపర్ హిట్ అవుతుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉత్తరాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజన్స్ బ్యానర్‌పై అలంకార్ పాండియన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘కిచ్చా సుదీప్, అనూప్ అందరూ నా పాత సినిమాలను గుర్తు చేశారు. సుదీప్.. కన్నడ అబ్బాయి కాదు తెలుగువాడే. తను హైదరాబాద్‌లోనే ఉంటాడు. సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. అందరికీ సుదీప్ నటుడిగా సుపరిచితుడు. ఇప్పుడు విక్రాంత్ రోణ అనే ఒకే చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సాధారణంగా ఇక్కడ ఈ సినిమా తీశారు అని గర్వంగా ఫీలై పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతాం. ఇంతకు ముందు బాహుబలి, ఆర్ఆర్ఆర్ పెట్టాం. విక్రాంత్ రోణ ట్రైలర్ రిలీజ్ తర్వాత చూసి అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తారనిపించింది. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాను త్రీడీలో తీశారని అంటున్నారు. కచ్చితంగా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. మా తెలుగు ఆడియెన్స్‌కు చాలా మంచి మనసు. ఎందుకంటే మా వాళ్లకు సినిమా నచ్చిందంటే తీసుకెళ్లి అక్కడ (పైకి చూపెడుతూ) పెడతారు. విక్రాంత్ సినిమాతో ఆ ఎక్సపీరియెన్స్‌ను మరోసారి చూడబోతున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ‘‘నేను చూసిన తొలి చిత్రం రాముడు భీముడు. మా అంకుల్ టీవీ కొన్నాడని తెలియగానే అదెలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు రాముడు భీముడు సినిమా చూశాను. థియేటర్‌లో నేను చూసిన తొలి చిత్రం శివ. నాకు భాష రాకపోయినా రెండు రోజుల్లోనే మూడు షోస్ చూశాను. సైకిల్ చైన్‌తో మరొకరిని కొట్టవచ్చునని అప్పటి వరకు నాకు తెలియలేదు. అది అప్పుడు స్టయిల్‌గా మారింది. నేను చేసిన ఒక ఫోన్ కాల్‌తో నాగార్జునగారు ఈరోజు ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా అనిపించింది. విక్రాంత్ రోణ సినిమాకు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే 65-70 శాతం సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే చిత్రీకరించాం. అందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించాం. 500-600 మంది అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్‌లో ఉన్నాం. మూడు నెలలు అక్కడ షూటింగ్ చేసినా ఒక కరోనా కేస్ కూడా రాలేదు. ఆర్ట్ డైరెక్టర్ శిబు లేకుండా ఉండుంటే అనూప్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుండలేడు. అలాగే అజనీష్ తన మ్యూజిక్‌తో సినిమాను పది మెట్లు పైకి తీసుకెళ్లాడు. నిర్మాత జాక్ మంజు లేకపోతే సక్సెస్‌ఫుల్‌గా జర్నీని పూర్తి చేసేవాళ్లం కాదు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. విక్రాంత్ రోణ చిత్రంతో వన్ ఆఫ్ ది బెస్ట్ 3డీ ఎక్స్‌పీరియెన్స్ ఫీల్ అవుతారని ప్రామిస్ చేస్తున్నాను. జూలై 28న సినిమా త్రీడీ, 2డీ టెక్నాలజీలో సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘విక్రాంత్ రోణ అనేది నా 20 ఏళ్ల కల. సుదీప్‌గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా ఫస్ట్ స్క్రిప్ట్ సుదీప్‌గారి కోసమే రాశాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేశాను. నాకు గర్వంగా ఉంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. గీతాంజలి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆయన ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా పిలిచి మరీ అభినందించారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 2డీ, త్రీడీల్లో విక్రాంత్ రోణి జూలై 28న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
నిరూప్ భండారి మాట్లాడుతూ ‘‘తెలుుగలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన సుదీప్‌గారికి థాంక్స్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. విక్రాంత్ రోణ ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో నాకొక మంచి పాత్రను ఇచ్చిన అనూప్‌కి ధన్యవాదాలు.నిర్మాత జాక్ మంజుగారికి థాంక్స్’’ అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ ‘‘అనూప్ భండారిని చూస్తుంటే నన్ను ఎంకరేజ్ చేసిన రాజమౌళిగారు గుర్తుకు వస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని చూసుకుని ప్లాన్‌చేసుకుని ముందుకు వెళుతుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. కోవిడ్ సమయంలో అన్ని చోట్ల షూటింగ్స్ ఆగిపోయాయి. కానీ నిర్మాత మంజునాథ్‌గారి వల్ల ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరిగింది. ఆయన ఎంత కష్టపడ్డా పైకి కనపడనీయకుండా ముందుండి ప్యాషన్‌తో నడిపించారు. విజయ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్స్ అదిరిపోయాయి. నిరూప్ భండారితో ఇది వరకే కలిసి పని చేశాను. పవన్ కళ్యాణ్‌గారికి ఎలాగైతే అన్న అని మనస్ఫూర్తిగా పిలుస్తానో.. కిచ్చా సుదీప్‌ని అలాగే పిలుస్తాను, ప్రేమిస్తాను. మనిషికి ఎంత వేల్యూ ఇవ్వాలి, పని ఎలా చేయాలి అని చాలా విషయాలను నేర్చుకున్నాను’’ అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ ‘‘కొంత మందితో పని చేస్తుంటే కొన్ని విషయాలను నేర్చకుంటుంటాం. అలాంటి వారిలో కిచ్చా సుదీప్ ఒకరు. టెక్నీషియన్స్‌కు ఆయన చాలా విలువ ఇస్తారు. మా నుంచి చాలా మంచి ఔట్‌పుట్ రాబట్టుకుంటారు. ఒక్కొక్క డైరెక్టర్‌ది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరి నుంచి విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే అనూప్ నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. సినిమా పెద్ద విజయం సాధించాలని నిర్మాత మంజుగారికి అభినందనలు తెలియజేస్తున్నాం’’ అన్నారు.
నీతూ మాట్లాడుతూ ‘‘సినిమా రిలీజ్‌కి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.