దర్శకుడిగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్. ఎస్ ఆర్ మూవీ జంక్షన్ బ్యానర్ ఆవిష్కరించిన మురళి మోహన్
దర్శకుడిగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్.
ఎస్ ఆర్ మూవీ జంక్షన్ బ్యానర్ ఆవిష్కరించిన మురళి మోహన్
తెలుగు తెరపై ఇప్పటిదాకా పలువురు కొరియోగ్రాఫర్ లు దర్శకులుగా మారారు. ప్రభుదేవా, లారెన్స్, విజయ్ బిన్నీ, గణేష్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి భారీ సినిమాలు రూపొందించారు. ఈ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ బాటలోనే మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ కూడా చేరబోతున్నారు. ఈనేపథ్యంలోనే ఎస్ ఆర్ మూవీ జంక్షన్ పేరుతో ఓ బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ లోగోను ప్రముఖ నటులు మురళి మోహన్ ఆవిష్కరించారు. సతీష్ రాజ్ స్వయంగా సాయి బాబా భక్తుడు అవడంతో స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రారంభించే తన ఇష్టదైవమైన సాయి బాబా కు అంకితం ఇవ్వాలే ఆశయంతో శ్రద్ధ సబూరి పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్ , ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు. ఒక దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు గంటల్లో చూపిస్తే కేవలం మూడు నిమిషాల్లో కథ మొత్తం అర్థమయ్యేలా ఒక్క పాటలో చూపించగలిగిన దర్శకుడే కొరియోగ్రాఫర్ అని ఈ సందర్బంగా మురళి మోహన్ అన్నారు. సతీష్ రాజ్ లాంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వల్ల చిత్రపరిశ్రమలో ఎంతో మంచి సినిమాలు వస్తాయని చెప్పారు. సినిమా ప్రారంభించే ముందు సాయి బాబాకు పాటను అంకితం ఇవ్వడం సతీష్ రాజ్ కు సినిమా పై ఉన్న పట్టుదలను తెలియజేస్తున్నదన్నారు. దర్శకుడిగా మారుతున్న సతీష్ రాజ్ ను మురళి మోహన్ అభినందించారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కొరియోగ్రాఫర్ ఒక దర్శకుడేనని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు చాలా మంది ఉన్నారని , అనేక మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అలాంటి అవకాశం ఇప్పుడు సతీష్ రాజ్ మాస్టర్ కు వచ్చిందని , ఆయనలో ఉన్న ప్రతిభ ఏంటి ఇప్పుడు దర్శకుడి రూపంలో చోడబోతున్నారని చెప్పారు. సతీష్ రాజ్ మాస్టర్ దర్శకుడిగా మారడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అన్నారు. కొరియోగ్రాఫర్ గా సక్సెస్ ఫుల్ అయినా సతీష్ రాజ్ భవిష్యత్తులో దర్శకుడిగా కూడా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని శేఖర్ మాస్టర్ చెప్పారు. కొరియోగ్రాఫర్ , దర్శకుడు విజయ్ బిన్నీ మాట్లాడుతూ సతీష్ రాజ్ కు తనకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉందని, అన్ని విధాలుగా అనుభవం ఉన్న సతీష్ రాజ్ దర్శకుడిగా మారడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పుడు చేసిన సాయి బాబా పాటను చాలా గొప్పగా, అద్భుతంగా తీశారని ఆయన పేర్కొన్నారు. పోలంకి మాస్టర్ మాట్లాడుతూ సతీష్ రాజ్ మాస్టర్ దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు, చరణ్ అర్జున్, దర్శకుడు చంద్రమహేశ్, మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నటులు కాదంబరి కిరణ్, వినోద్ బాల, పలువురు కొరియోగ్రాఫర్లు , హీరోయిన్ శిరీష, నిర్మాత అర్చన తదితరులు పాల్గొన్నారు.