నాలుగు ఊళ్ల మధ్య పోటెత్తుతున్న ఎర్ర సముద్రం “దేవర”
ట్రిపుల్ ఆర్ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా. ఎన్నో అంచనాలు. అన్నే భయాలు. భారీగా చేద్దామనుకొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాస్త అర్థాంతరంగా ఆగిపోయింది. అయినా ఎన్టీఆర్ పై ఏదో నమ్మకం. ఎన్టీఆర్ కు వరుస హిట్లు ఇస్తున్న ‘కాలర్ సెంటిమెంట్’ గురి తప్పదని ధైర్యం. మరి ఆ నమ్మకం నిజమైందా? ఎన్టీఆర్ తన అభిమానులు తనపై పెట్టుకొన్న అంచనాల్ని అందుకొన్నాడా? ‘దేవర’ ఎలా ఉంది? అభిమానులకు ఏ స్థాయిలో నచ్చుతుంది?
కధలోకి వెళ్తే:
నాలుగు ఊళ్ల మధ్య పోటెత్తుతున్న ఎర్ర సముద్రం. దానికో చరిత్ర. బ్రిటీష్ వాళ్లు దేశ సంపదని దోచుకొని, ఇంగ్లండ్ తీసుకెళ్లిపోతుంటే.. నాలుగు ఊళ్ల జనం, సైన్యంలా మారి, బ్రిటీష్ వాళ్లని అడ్డుకొని, ఆ సంపద మళ్లీ తమ దేశానికి తెచ్చుకొంటుంటారు. కాలక్రమేణా అదే వాళ్ల వృత్తిగా మారిపోతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆ ఊరి ప్రజలకు పని లేకుండా పోతుంది. సముద్రంలో సరుకు రవాణ చేస్తున్న ఓడల్ని అడ్డుకొని, అందులోని విలువైన వస్తువుల్ని ఓ షావుకారికి అప్పగించడం, తద్వారా డబ్బులు సంపాదించడం.. అలవాటుగా మారుతుంది. నాలుగు ఊళ్లకీ నలుగురు నాయకులు. ఓ ఊరికి నాయకుడు దేవర (ఎన్టీఆర్). ఎందుకో తాము చేస్తున్న పనిపై ఇష్టం ఉండదు. ఓ సందర్భంలో తాము చేస్తున్న ఈ దొంగతనాల వల్ల ఎంతెంత నష్టం జరుగుతుందో తెలుసుకొంటాడు. అప్పటి నుంచీ.. సముద్రంపై దొంగతనాలకు వెళ్లడానికి మిగిలిన ఊరి వాళ్లని కూడా అడ్డుకొంటాడు. కానీ ఇదే వృత్తిని నమ్ముకొన్న భైర (సైఫ్ అలీఖాన్) మిగిలిన వాళ్లతో చేతులు కలిపి, దేవరని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి అది జరిగిందా? దేవర కొడుకు వర (ఎన్టీఆర్) సంగతేంటి? దేవరకూ, వర కూ ఉన్న వ్యత్యాసమేంటి? దేవర ఆ నాలుగు ఊర్ల కోసం చేసిన త్యాగం ఏమిటి? ఇదంతా మిగిలిన కథ. ఈరోజుల్లో కథ కంటే వరల్డ్ బిల్డింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శకులు. ఈ కథలో అలాంటి సెటప్ ఒకటి ఉంది. నాలుగు ఊర్లు.. వాటి మధ్య ఎర్ర సముద్రం. ఆ సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న జనం. సముద్రంలో దొంగతనాలు.. ఇదంతా మనం ఇప్పటి వరకూ చూడని కొత్త సెటప్. ఈ సెటప్‌కి కొరటాల లాంటి రచయిత తోడయ్యాడు. ఎన్టీఆర్ తాను రెగ్యులర్ గా చేసే మాస్, మసాలా కమర్షియల్ సినిమా కాదిది. ఎన్టీఆర్ లాంటి హీరో దొరికినప్పుడు ప్రయోగాల జోలికి వెళ్లకుండా రెగ్యులర్ రూట్లోనే రిస్కు లేని ప్రయాణం చేయాలనుకొంటారు. ఓ ఇంట్రడక్షన్ పాట, ఫైటూ, కొన్ని కామెడీ సీన్లు, రొమాన్స్, ఓ బలమైన ట్విస్టు ఉంటే సినిమా మరీ అద్భుతాలు చేయకపోయినా పాస్ అయిపోతుంది. కానీ కొరటాల మాత్రం కథని, అందులోని ఎమోషన్ ని నమ్మాడు. అలాగని హీరోయిజాన్ని, ప్రేక్షకులు కోరుకొనే ట్విస్టుల్నీ, రొమాన్స్ నీ నెగ్లెట్ చేయలేదు. వాటిని కూడా తెలివిగా మిక్స్ చేశాడు. ఈ కథలో అంతర్లీనంగా బలమైన ఎమోషన్ ఉంది. మనిషి బతకడానికి సరిపడినంత ధైర్యం చాలు. ఎక్కువ ధైర్యం కూడా మనిషికి హాని చేస్తుందన్న కొత్త పాయింట్ కొరటాల దగ్గర ఉంది. దానికి ఎన్టీఆర్ మాస్ మానియా, మేకింగ్ వాల్యూస్, వరల్డ్ బిల్డింగ్, అనిరుథ్ సంగీతం ఇవన్నీ కలిసొచ్చాయి. ఎర్ర సముద్రాన్ని వెదుక్కొంటూ వచ్చే కొంతమంది పోలీస్ ఆఫీసర్ల కథగా ‘దేవర’ని చాలా ఇంట్రస్టింగ్ నోట్ తో ప్రారంభించాడు కొరటాల శివ. ఎన్టీఆర్ ఎంట్రీ, ఆయుధ పూజ పాట, ఆ తరవాత వచ్చే ఫైట్.. ప్రేక్షకుల్ని ఇరవై నిమిషాల పాటు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి. ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు, తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్ భలే కుదిరాయి. పాటకు తన స్టైల్ ని జోడించి ఓ కొత్త సిగ్నేచర్ తీసుకొచ్చాడు ఎన్టీఆర్. దేవర రియలైజేషన్ పాయింట్ కూడా ఆకట్టుకొనేలా తెరకెక్కించాడు. ఇంట్రవెల్ బ్యాంగ్, అక్కడ అనిరుథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆ ఫైట్ ని కంపోజ్ చేసిన విధానం.. ఇవన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగలా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో వర కథ మొదలవుతుంది. అక్కడే జాన్వీ ఎంట్రీ ఇస్తుంది. వర పాత్రని భయస్థుడిగా చిత్రీకరించారు. ఈ విషయం ట్రైలర్ లోనే చెప్పేశారు. కాకపోతే.. ఎన్టీఆర్, జాన్వీల మధ్య మంచి లవ్ ట్రాక్ రాసుకొని ఉండాల్సింది. అసలు దానిపై కొరటాల దృష్టి పెట్టలేదు. జాన్వీ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. జాన్వీ తెలుగులో సినిమా ఎప్పుడెప్పుడు చేస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అలాంటప్పుడు ఈ పాత్రని బలంగా రాసుకోవాల్సింది. బహుశా.. పార్ట్ 2 కోసం కొరటాల ఈ పాత్రని అట్టిపెట్టారనిపిస్తుంది. సెకండాఫ్‌లో గూజ్ బమ్స్ తెచ్చే మూమెంట్స్ పెద్దగా కనిపించలేదు. ఫస్టాఫ్‌లో ఉన్న హై.. సెకండాఫ్ లో రాదు. అలాగని బోర్ కూడా కొట్టించదు. ‘చుట్టమల్లే’ పాట, ఆ పాటలో జాన్వీ గ్లామర్ కాస్త థియేటర్‌ని అలెర్ట్ చేస్తుంది. క్లైమాక్స్ లో 10 నిమిషాలూ థియేటర్ ఊగిపోతుందని కొరటాల శివ ముందే హింట్ ఇచ్చేశారు. కాబట్టి ఆ పది నిమిషాల్లో ఎలాంటి విధ్వంసం జరిగి ఉంటుందో అని అభిమానులు ఎదురు చూపుల్లో పడిపోతారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొంతమంది ఊహించినా, ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఎలివేషన్లకు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. అయితే ఆ ఫైట్ ని ఇంకాస్త బాగా తీర్చిదిద్ది ఉండాల్సింది. పార్ట్ 2కి సంబంధించిన గ్లింప్స్ ఏమీ చివర్లో చూపించలేదు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నల్ని మాత్రం రేకెత్తించి, సమాధానాల కోసం ఎదురు చూసేలా చేయగలిగాడు. దావూదీ పాట అసలు ఈ సినిమాలోనే లేదు. చిత్రీకరించి కూడా సరిగా ప్లేస్ మెంట్ చేయలేకపోయారు. ఎండ్ కార్డ్స్ లో వస్తుందని ఫ్యాన్స్ ఊహించారు. కానీ.. అక్కడ కూడా ఈ పాటకు ప్లేస్ మెంట్ కుదర్లేదు. ఎన్టీఆర్ ఓ డైనమైట్. దాన్ని వాడుకోవడం రావాలంతే. ఎన్టీఆర్ నుంచి ఎన్ని ఎమోషన్లు రాబట్టొచ్చో కొరటాల శివకు బాగా తెలుసు. ఈసారి తన పాత్రపై మరింత బరువు బాధ్యతలు వేసేశారు. దేవరగా చాలా హుందాగా కనిపించాడు ఎన్టీఆర్. తన వాయిస్ కూడా గంభీరంగా ఉంది. పాటల్లో స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. దేవర ఎప్పుడు కనిపించినా ఒక ఆరా.. వచ్చేస్తుంది. అదంతా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఉన్న మ్యాజిక్. వర పాత్రని ఇంకాస్త యాక్టీవ్ గా మార్చాల్సింది. లవ్ స్టోరీ సరిగా డీల్ చేయకపోవడం వల్ల ఆ పాత్ర ఇంకా మూడీగా అయిపోయిందేమో అనిపించింది. చివర్లో వర పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ మాత్రం బాగుంది. జాన్వీ కపూర్ పాత్రకు సరైన న్యాయం చేయలేదు. ‘చుట్టమల్లే’ పాటలో మాత్రం తను అందచందాలతో ఆకట్టుకొంది. సైఫ్‌ది చెప్పుకోదగిన పాత్రే. కానీ తనని కూడా సెకండాఫ్ లో సరిగా వాడలేదు. అనిరుథ్ ఈ సినిమాకు మరో హీరో. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్లకు బాగా ఉపయోగపడింది. మేకింగ్ పరంగా నిర్మాతలు రాజీ పడలేదు. ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగారు. కొరటాల మార్క్ డైలాగులు ఈ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తాయి. భయం – ధైర్యం గురించి ఆయన చేసిన క్వాయినింగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైనింగ్ బాగా కుదిరింది. మూడు గంటల సినిమా ఇది. పది నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు. అప్పుడు ఇంకాస్త వేగం వచ్చేది. దాదాపు ఆరేళ్ల తరవాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా ఇది. అభిమానులు అవురావురుమంటూ ఉన్నారు. వాళ్లకు సరైన విందు భోజనమే వడ్డించాడు. స్టార్ హీరో ఎవరైనా సరే, తన అభిమానుల్ని సంతృప్తి పరచడమే ప్రధాన ధ్యేయం. ఆ విషయంలో ‘దేవర’ సక్సెస్ అయ్యాడు.
Boxoffice Rating: 3/5