లింగ సమానత్వం గురించి చెప్పే స్వాగ్
శ్రీ విష్ణు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీ విష్ణు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు స్వాగ్ అంటూ వచ్చాడు. ఐదారు పాత్రలను ఒకే సినిమాలో పోషించడం, వేరియేషన్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి శ్రీ విష్ణు ఇప్పుడు స్వాగ్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
కథ ఎస్సై భవభూతి (శ్రీ విష్ణు) భార్య రేవతి (మీరా జాస్మిన్) గర్భవతిగా ఉన్నపుడు ఇంటి నుంచి వెళ్లిపోతోంది. భార్య దూరం కావడంతో ఎస్సై భవభూతి మొరటు మనిషిగా, స్త్రీ ద్వేషిగా మారుతాడు. రిట్టైర్మెంట్ ఏజ్‌లో ఉన్న అలాంటి భవభూతికి ఓసారి ఓ లేఖ వస్తుంది. శ్వాగణిక వంశ వారసుడివి అంటూ.. వంశ వృక్ష నిలయంకు వెళ్తే నిధి దొరుకుతుందని అందులో ఉంటుంది. దీంతో ఎస్సై భవభూతి వంశ వృక్ష నిలయంకు వెళ్తాడు. అక్కడి చిట్ట చివరి వారసుడైన యయాతి (శ్రీ విష్ణు) రూపమే భవభూతికి ఉంటుంది. కానీ ఇంటి పేరు, తండ్రి పేరు మాత్రం సరితూగదు. దీంతో తాను శ్వాగణిక వంశానికి చెందిన వాడే అని నిరూపించుకోవాలని అనుకుంటాడు. మరో వైపు సింగ (శ్రీ విష్ణు) తన తండ్రి ఎవరో తెలియని కారణంతో అవమానాలు ఎదుర్కొంటాడు. సింగకి కూడా ఓ లేఖ వస్తుంది. ఈ లేఖలన్నీ కూడా విభూతి (శ్రీ విష్ణు) పంపుతుంది. ఇక శ్వాగణిక వంశానికి సంబంధించిన ఓ పలక అనుభూతి (రీతూ వర్మ) ఇంట్లో దొరుకుతుంది. దీంతో అసలు వారసులు ఎవరు అనేది గందరగోళంగా మారుతుంది? అసలు రాజు భవభూతి (శ్రీ విష్ణు) మహారాణి రుక్మిణి (రీతూ వర్మ)ని ఎదురించి పితృస్వామ్య వ్యవస్థను ఎలా నిలబెట్టాడు? కింగ్ భవభూతి పెట్టిన శాపం ఏంటి? విభూతి ఎవరు? ఆ నిధికి అసలు వారసులు ఎవరు? చివరకు ఏం జరుగుతుంది? అన్నది కథ.
స్వాగ్ పాయింట్ చాలా చిన్నది.. లింగ సమానత్వం గురించి చెప్పే ఓ పాయింటే స్వాగ్ మూవీ. ఎమోషనల్ పాయింట్‌లతో అలాంటి కాన్సెప్ట్‌ను టచ్ చేయాల్సి ఉంటుంది.హసిత్ గోలి స్వాగ్ మూవీని చాలా లేయర్లుగా తిప్పి తిప్పి చూపించాడు. లింగ సమానత్వం అనే సింపుల్ కాన్సెప్ట్‌ను చాలా సింపుల్‌గానూ తీసి ఉండొచ్చు. కానీ ఇలా చాలా లేయర్డ్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ స్టైల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా కథను రాసుకోవడమే చాలా కష్టం.. అలా రాసుకున్న కథను.. గందరగోళం లేకుండా అంతే డీటైల్డ్‌గా చూపించడమూ కష్టమే. కానీ హసిత్ గోలి రెండింట్లో పాస్ అయినట్టుగా కనిపిస్తుంది.
హసిత్ గోలి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీని నమ్ముకున్నాడు. గోపరాజు రమణ, రవిబాబు ట్రాక్.. భవభూతి ట్రాక్ ఇలా అన్నీ కూడా బాగుంటాయి. ఇంటర్వెల్‌కు ట్విస్ట్ అదిరిపోతుంది. కేవలం శ్రీ విష్ణు యాక్టింగ్, వేరియేషన్స్ కోసమే ఈ సినిమాను చూడొచ్చు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, గోపరాజు రమణ, గెటప్ శ్రీను, రవి బాబు ఇలా అన్ని పాత్రలు కూడా మెప్పిస్తాయి.
Boxoffice Rating: 2.5/5