తెలుగు

ప్రభాస్ పై బాలీవుడ్ నటి ప్రశంశలు

By admin

November 28, 2024

ప్రభాస్ పై బాలీవుడ్ నటి ప్రశంశలు

ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉంది. సినీ సెలబ్రిటీలు సైతం ప్రభాన్ ను ఎంతో అభిమానిస్తారు. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు.

ఓ హిందీ ఛానల్ టాక్ షోలో జరీనా మాట్లాడుతూ… ప్రభాస్ ఎంతో మంచి మనిషని… అంత మంచి వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. ప్రభాస్ లాంటి వ్యక్తి మరొకరు లేరని అన్నారు. వచ్చే జన్మలో తనకు ఇద్దరు కొడుకులు కావాలని… వారిలో ఒకరు ప్రభాస్ లాంటి కొడుకు, మరొకరు సూరజ్ (జరీనా సొంత కొడుకు)లాంటి కొడుకు అని అన్నారు.

ప్రభాస్ కు పెద్ద స్టార్ అనే అహం ఏమాత్రం లేదని జరీనా చెప్పారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరినీ ఆయన కలుస్తారని, వెళ్లిపోయే ముందు అందరికీ బై చెపుతారని తెలిపారు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే… వెంటనే ఇంటికి ఫోన్ చేసి సెట్ లో ఉన్న 30 – 40 మందికి భోజనాలు తెప్పిస్తారని చెప్పారు. ప్రభాస్ ఎంత గొప్పవాడు అనేదాన్ని తాను వర్ణించలేనని చెప్పారు. ప్రభాస్ కు అల్లాహ్ మంచి ఆరోగ్యాన్ని, నిండు జీవితాన్ని ఇస్తాడని అన్నారు.

జరీనా వహాబ్ హిందీ నటి అయినప్పటికీ… ఆమె అచ్చమైన తెలుగు మహిళ. విశాఖలో పుట్టి పెరిగారు. బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ ఆదిత్య పంచోలిని పెళ్లి చేసుకున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఆమె… హిందీతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు.

‘దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి పాత్రను జరీనా పోషించారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ప్రభాస్ చిత్రం ‘ది రాజా సాబ్’లో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ కామెడీగా తెరక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. రూ. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.