తెలుగు

భానుమతి, విజయనిర్మల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి.జయ!

By admin

January 11, 2025

భానుమతి, విజయనిర్మల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి.జయ!

సినిమా రంగంలోని సాంకేతిక విభాగాలలో మహిళలు రాణించడం అనేది తక్కువగా చూస్తుంటాం. అందులోనూ దర్శకత్వ శాఖలో తమ ప్రతిభను చాటుకున్న వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి వారిలో మొదటగా భానుమతి, విజయనిర్మల వంటివారి పేర్లు వినిపిస్తాయి. వీరి తర్వాత దర్శకురాలిగా ప్రేక్షకుల్ని మెప్పించి, విజయవంతమైన సినిమాలు రూపొందించిన వారిలో బి.జయ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి, కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన తర్వాత సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని స్థాపించి పత్రికారంగంలో కూడా విశేష పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆ తర్వాత దర్శకురాలిగా తన ప్రయాణం మొదలుపెట్టి అద్భుతమైన విజయాలు అందుకున్నారు. జర్నలిస్ట్‌ నుంచి దర్శకురాలిగా ఎదిగిన బి.జయ జయంతి జనవరి 11. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాల గురించి, తన కెరీర్‌లో సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

1964 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ. చెన్నయ్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(ఇంగ్లీష్‌ లిటరేచర్‌), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) అభ్యసించారు. చదువు పూర్తి కాగానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సినిమా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా పనిచేశారు. ఆరోజుల్లోనే సినిమా జర్నలిస్ట్‌లలో డైనమిక్‌ లేడీగా పేరు తెచ్చుకున్నారు. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పడం ఆమెకు మొదటి నుంచీ అలవాటు. పత్రికలలో ఆమె రాసే ఆర్టికల్స్‌ కూడా అలాగే ఉండేవి. దాంతో అందరి దృష్టినీ ఆకర్షించారు జయ. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ శాఖలో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.

అదే సమయంలో ఫిల్మ్‌ జర్నలిస్ట్‌గా, పి.ఆర్‌.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ పూర్తి అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు. అప్పటివరకు తమకు ఉన్న అనుభవంతో 1994లో సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని సొంతంగా ప్రారంభించారు. తొలి సంచికతోనే సంచలనం సృష్టించి ఆరోజుల్లో ప్రముఖంగా వున్న సినీ వారపత్రికలకు పోటీగా సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ వీక్లీని నిలబెట్టారు బి.ఎ.రాజు, బి.జయ దంపతులు. ఆరోజు మొదలుకొని చివరి రోజుల వరకు ఒక్క వారం కూడా పత్రిక ఆలస్యం అవకుండా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఘనత ఆ దంపతులకు దక్కుతుంది.

సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం, దర్శకత్వంపై తనకు ఉన్న ప్యాషన్‌ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహకారం అందించడంతో సూపర్‌హిట్‌ ఫ్రెండ్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్‌లీ, వైశాఖం వంటి సినిమాలను రూపొందించి భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బి.జయ.

బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు సినిమా రంగంతో విశేష అనుబంధం ఉండేది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసింది. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్‌ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు.