మన దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక పార్ట్ టైమ్ పాఠశాల కావాలన్నదే మలయాళ చిత్రం “సూత్రవాక్యం” సారాంశం
“జినీవెర్స్” ద్వారా ప్రపంచవ్యాప్తంగా 11న మలయాళం వెర్షన్ విడుదల!!
*తెలుగులో ఈనెలాఖరుకు!!*
మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గౌరవం, ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మలయాళం నుంచి వస్తున్న మరో హార్ట్ టచ్చింగ్ మూవీ “సూత్రవాక్యం”. ఈనెల 11న మలయాళ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా “జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్” ద్వారా విడుదలవుతోంది. ఇదే సంస్థ “సూత్రవాక్యం” పేరుతోనే తెలుగులోనూ విడుదల చేస్తోంది!!
“పోలీస్ స్టేషన్స్ కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది… పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనకు.. పుష్కలమైన వినోదం జోడించి రూపొందిన “సూత్రవాక్యం” భారతీయ చలన చిత్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇంత గొప్ప కంటెంట్ కలిగిన “సూత్రవాక్యం” చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం పట్ల చాలా గర్వపడుతున్నాం” అంటున్నారు “సినిమా బండి” ఫేమ్ కాండ్రేగుల లావణ్యాదేవి – కాండ్రేగుల శ్రీకాంత్!!
యూజియాన్ జాస్ చిరమ్మల్ అనే ప్రతిభాశాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యాదేవి సమర్పణలో… కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో… షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ ముఖ్య తారాగణం. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. భారతీయ సినిమాను సరికొత్త పుంతలు తొక్కించే ఈ వినూత్న కథా చిత్రానికి రెజిన్ ఎస్.బాబు స్క్రీన్ ప్లే సమకూర్చగా శ్రీరామ్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ, జీన్ పి.జాన్సన్ సంగీతం, నితిన్ కె.టి.ఆర్ ఎడిటింగ్ చేశారు!!
కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్ లో… యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో “సూత్రవాక్యం” తెరకెక్కడం గమనార్హం. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో “సూత్రవాక్యం” విడుదల కానుంది!!