తెలుగు

ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమితులైన కొండపనేని ఉమామహేశ్వరరావు గారికి ఫిల్మ్ క్రిటిక్స్ ఘన సత్కారం

By admin

May 29, 2026

ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమితులైన కొండపనేని ఉమామహేశ్వరరావు గారికి ఫిల్మ్ క్రిటిక్స్ ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యక్షుడు మరియు కార్యవర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా సీనియర్ పాత్రికేయుడు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుడు కొండపనేని ఉమామహేశ్వరరావు గారిని ఎంపిక చేశారు. దీనిని పురస్కరించుకుని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పాలకవర్గం శుక్రవారం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆయనకు ఘన సత్కారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి పుష్పగుచ్ఛం అందజేయగా, సీనియర్ సభ్యులు ఎ. బాలిరెడ్డి, కె. వెంకటేశ్వరరావులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “ఉమామహేశ్వరరావు గారితో మద్రాస్ రోజుల నుంచే కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఆయన కార్యదీక్ష, సౌమ్యత అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాధ్యతలు రావడం ఆనందంగా ఉంది” అన్నారు. సీనియర్ సభ్యుడు ఎ. బాలిరెడ్డి మాట్లాడుతూ, “నేను ఈనాడు జర్నలిస్టుగా మద్రాస్ వెళ్లినప్పుడు అక్కడ ఎవరూ పరిచయం లేని పరిస్థితిలో ఉమామహేశ్వరరావు గారు నాకు అండగా నిలిచారు. అప్పటి నుండి మా అనుబంధం కొనసాగుతోంది. అందరివాడైన ఆయనకు ఈ పదవి రావడం సముచితం” అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సీనియర్ జర్నలిస్టు మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ, “మద్రాస్‌లో అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు గారు నన్ను ఇంటికి తీసుకెళ్లి ధైర్యం చెప్పారు. అలాంటి మంచి వ్యక్తికి ప్రభుత్వం మంచి బాధ్యత ఇవ్వడం ఆనందంగా ఉంది” అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఏ. ప్రభు మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమలో వివాదరహితుడిగా, అందరివాడిగా పేరుగాంచిన ఉమామహేశ్వరరావు గారికి ఈ పదవి అలంకారప్రాయమైనది. ఆయనకు పరిశ్రమకు సంబంధించిన అనేక కమిటీల్లో పనిచేసిన అనుభవం ఉంది” అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “మితభాషి, అందరికీ ఆప్తుడైన ఉమామహేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది” అన్నారు. ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ, “ఉమామహేశ్వరరావు గారు ఎన్నో సంవత్సరాలుగా సినిమా పరిశ్రమకు సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల కమిటీలో పలు మార్లు సభ్యులుగా పనిచేశారు. అలాగే ఆస్కార్ కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. ఆయనను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ గారికి, హీరో బాలకృష్ణ గారికి ధన్యవాదాలు” తెలిపారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ, “మా అసోసియేషన్ సీనియర్ సభ్యుడు ఉమామహేశ్వరరావు గారికి ఈ పదవి రావడం మా అందరికీ గౌరవకరం. ఆయన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది” అన్నారు. కొండపనేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, “నా కుటుంబ సభ్యుల్లాంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సహచరులు నాకు ఈ ఆత్మీయ సత్కారం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పదవి రావడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి, భరత్ భూషణ్ గారికి, ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం.డి. అబ్దుల్, కోశాధికారి చదలవాడ భరద్వాజ్, కార్యవర్గ సభ్యులు అప్పాజీ, చందు రమేష్, ఆర్.డి.ఎస్. ప్రకాష్, గోరంట్ల రవి తదితరులు పాల్గొన్నారు.