*ఊహించని మలుపులతో  “అన్నపూర్ణమ్మగారి మనవడు”*

*ఊహించని మలుపులతో  “అన్నపూర్ణమ్మగారి మనవడు”*
  అది గుంటూరు జిల్లాలోని అమరావతి దగ్గరలో ఉన్న వైకుంఠపురం అనే అందమైన పల్లెటూరు. అక్కడి పచ్చటి పంట పొలాలు, కాలువ గట్లు, చెరువు ఒడ్డు.. ఆ ప్రకృతి అందాలన్నిటినీ ఒడిసి పట్టుకుని ఓ కుటుంబ కథా నేపద్యంలో రమణీయంగా  సెల్యులాయిడ్ కి ఎక్కించి  “అన్నపూర్ణమ్మ గారి మనవడు” పేరుతో అచ్చ తెలుగు కుటుంబ కథా చిత్రాన్ని సీనియర్ దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో నిర్మించారు నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి.
  ఓ మిస్సమ్మ, ఓ ముత్యాల ముగ్గు, ఓ సీతారామయ్యగారి మనవరాలు, ఓ శతమానంభవతి.. ఇప్పుడు ఓ “అన్నపూర్ణమ్మ గారి మనవడు”. తెలుగుతనం, గ్రామీణ వాతావరణం, కుటుంబం లోని ప్రేమానురాగాలు.. ఇవన్నీ మిళితం చేసి తీసిన తెలుగు సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవలోనే రూపు దిద్దుకుని త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు తెరవిందు చేయబోతున్న పదహారణాల అచ్చ తెలుగు కుటుంబ కథా చిత్రం “అన్నపూర్ణమ్మ గారి మనవడు”.
నోరూరించే పాయసం, నెయ్యి ముద్దపప్పు, వడియాలు, ఆవకాయ, గోంగూర, ఉలవచారు, గడ్డపెరుగు.. ఇలా షడ్రుచులతో వండి వడ్డించిన విందు భోజనం తెలుగు వారికి ఎంత కమ్మగా ఉంటుందో, కుటుంబ నేపధ్య కథనం, సంగీతం, ప్రేమ, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో కలగలిపి అందంగా తెరకెక్కించిన “అన్నపూర్ణమ్మ గారి మనవడు” సినిమా కూడా అంతే కమనీయంగా ఉంటుంది.
  దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆనాటి అందాల నటి, కళాభారతి శ్రీమతి జమున గారు అక్కినేని అనసూయమ్మపాత్రలో నటించటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. టైటిల్ రోల్స్ లో అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్ నటి అన్నపూర్ణ, మనవడిగా మాస్టర్ రవితేజ పోటీ పడి నటించారు.
  మిర్యాలగూడలో జరిగిన అమృత, ప్రణయ్ ల యదార్ధ గాధ ఆధారంగా నిర్మించ బడిన ఈ చిత్రంలో అమృత పాత్రను బిగ్ బాస్ ఫేమ్ అర్చన పోషిస్తోంది. ప్రణయ్ గా జాతీయ ఉత్తమ నటుడు బాలాదిత్య ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అందరూ తెలుగు నటులే నటించడం ఈ చిత్రం లోని మరో విశేషం. చిత్రం లోని ఇతర పాత్రలలో ప్రముఖ నటులు శ్రీలక్ష్మి గారు, సుధ, జయవాణి, కరాటే కళ్యాణి, సింగర్ బేబి, బెనర్జీ గారు, రఘుబాబు, జీవా, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, అదుర్స్ రఘు, ఎమ్మెన్నార్ చౌదరి గారు తదితరులు నటించారు.
  తెలుగు ప్రేక్షకులకు గతంలో కళాఖండాల్లాంటి అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి, శ్రీ కె.విశ్వనాథ్ గారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుని, ప్రశంసించారు.
  మిర్యాలగూడలో జరిగిన రియల్ లవ్ స్టోరీకి, అందమైన పల్లెటూరు వైకుంఠపురం లోని అన్నపూర్ణమ్మ గారి మనవడికీ లంకె ఏమిటో తెలుసుకోవాలంటే “అన్నపూర్ణమ్మ గారి మనవడు” సినిమా చూడాల్సిందే మరి. యాక్షన్ చిత్రాలపై పట్టున్న రాకింగ్ డైరెక్టర్ నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) ఈ చిత్రాన్ని ఊహించని ట్విస్టులతో అద్భుతంగా తీశారని ఫిలిమ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ అందించిన బాణీలు వినసొంపుగా ఉన్నాయి. ఈ చిత్రం లోని పాటలకు లిరిక్ రైటర్స్ మౌనశ్రీ మల్లిక్, ఎస్. వి. రఘుబాబు అందించిన సాహిత్యం సందర్భానుసారంగా ఉండి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. ఈ చిత్రం లోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయి యూట్యూబ్ లో అలరిస్తున్నాయి.
  అఖిలాంద్ర, తెలంగాణ, రాష్ట్రేతర తెలుగు వారు ఆస్వాదించటం కోసం కమ్మని విందు భోజనం లాంటి  చిత్రం “అన్నపూర్ణమ్మ గారి మనవడు” త్వరలోనే మీ ముందుకు రాబోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *