*ఘనంగా “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” ప్రీ రిలీజ్ కార్యక్రమం*

  • *ఘనంగా “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” ప్రీ రిలీజ్ కార్యక్రమం*

విజయ్ శంకర్‌, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ . వెంకటరమణ.ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పడ్డాన మన్మథరావు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు వీరభద్రమ్ చౌదరి, మ్యూజిషియన్ సామల వేణు, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత పడ్డాన మన్మథరావు మాట్లాడుతూ…సినిమా నిర్మించాలనేది నా కోరిక. మంచి సినిమా చేయాలని ప్రయత్నిస్తుంటే.. దర్శకుడు వెంకటరమణ మంచి స్టోరీ తీసుకొచ్చాడు. ప్రేమికులు, తల్లిదండ్రులకు, సమాజానికి నచ్చే కథ ఇది. ఆర్నెళ్లు కథను తయారుచేసి సెట్స్ మీదకు వెళ్లాం. మీ ఆశీర్వాదం ఉంటే సినిమా స్థాయి పెరుగుతుంది. కొన్ని సినిమాలు కుటుంబంతో చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సినిమా సకుటుంబంగా చూడొచ్చు. హీరోకు బాగా పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. హీరోయిన్ మౌర్యానీకి ఖచ్చితంగా అవార్డ్ వస్తుంది. అంత బాగా నటించారు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న దేవరకొండలో విజయ్ ప్రేమకథ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

దర్శకుడు వెంకటరమణ.ఎస్. మాట్లాడుతూ….నిర్మాత పడ్డాన మన్మథరావు గారు నా ఫ్రెండ్. నాలుగైదు కథలు ఆయన దగ్గరకు తీసుకెళ్లా. ఆయన నాకు ఒకే మాట చెప్పారు. నేను నా ఫ్యామిలీతో సినిమా చూడాలి. అలాంటి కథ తీసుకురా అన్నారు. నాకో మంచి సినిమా చేయడానికి ఆయన అవకాశం ఇచ్చారు. కెమెరామెన్ అమర్ చాలా సపోర్ట్ చేశారు. మౌర్యానీ ఈ సినిమాకు హీరో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చిత్రీకరిస్తూ ఏడ్చిన రోజులున్నాయి. ఈ సినిమా టైటిల్ గురించి చాలా మంది ఫోన్లు చేశారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఫోన్లు చేశారు. ఈ టైటిల్ పెట్టడానికి ఒక ఊర్లో జరిగే విజయ్ అనే యువకుడి ప్రేమ కథ కారణం. ఏడు ఏనిమిది ఏళ్ల క్రితం విజయ్ దేవరకొండకు కథ చెప్పాను. ఆయన పది నిమిషాలు విన్నారు. చాలా బాగుందని చెప్పి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కోమాలకు ఫోన్ చేసి చెప్పారు. కథ బాగుంది నువ్వు చేయి అని అతనితో అన్నారు. ఒక కథ చెప్పాక బాగుండి కూడా ఇది నాకు యాప్ట్ కాదు వేరే వాళ్లతో చేయమని చెప్పిన తొలి హీరో విజయ్ దేవరకొండ. ఆ రోజే విజయ్ దేవరకొండకు చెప్పాను నువ్వు పెద్ద హీరోవు అవుతావు అని. ఇది విజయ్ దేవరకొండ మీద అభిమానంతో పెట్టుకున్న పేరే గానీ ఇంకోటి కాదు. అన్నారు.

హీరోయిన్ మౌర్యానీ మాట్లాడుతూ….షూటింగ్ టైమ్ లో నిర్మాత మాకే లోటు లేకుండా చూసుకున్నారు. దర్శకుడు వెంకటరమణ గారికి థ్యాంక్స్. నా ఫస్ట్ మూవీ అర్థనారీ తర్వాత నాకు హార్ట్ టచింగ్ అనిపించిన చిత్రమిదే. దర్శకులు ప్రతిసారీ మాలాంటి ఆర్టిస్టులకు లైఫ్ ఇస్తుంటారు. నాకు లైఫ్ ఇచ్చే చిత్రమిది. ప్రతి సన్నివేశాన్ని చక్కగా రూపొందించారు దర్శకుడు వెంకటరమణ. ఎమోషనల్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంటుంది. నిజంగా జరిగిన ప్రేమ కథ ఇది. ఇందులో వాస్తవ సంఘటనలు స్ఫూర్తి ఉంది. అన్నారు.

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ….మా అన్నయ్య నిర్మాత మన్మథరావు లేకుంటే నేను లేను. ఆయన రుణం తీర్చుకోలేను. నన్ను హీరోగా స్టేజీ మీద నిలబెట్టారు. ఆయన ఒక హీరో ఎలా ఉండారో అలా నన్ను మార్చేశారు. ఆయన ఇచ్చిన సహకారంతో ఇవాళ నేను ఆరు సినిమాలు పూర్తి చేయగలిగాను. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకులు వెంకటరమణ. ఆయన ప్రాణం పెట్టి సినిమా చేశారు. సీన్ ఎలా అనుకున్నారో అలా చేశారు. మాతో చేయించుకున్నారు. మౌర్యానీ నేను బాగా నటించేందుకు సహకరించారు. అన్నారు.

రచ్చ రవి మాట్లాడుతూ…మన్మథరావు నాకు మంచి ఫ్రెండ్. ఇది కొత్త కథ. విజయ్ శంకర్ బాగా నటించాడు. మౌర్యానీ చాలా బాగా నటించిందని ఈ సినిమా చూశాక నిర్మాతకు చెప్పాను. మహా శివరాత్రి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రేక్షకులు ఆదరించి, కొత్త తరహా చిత్రాలకు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిషియన్ సామల వేణు మాట్లాడుతూ…నాకు వచ్చినన్ని అవార్డ్స్, ఈ మూవీకి కూడా రావాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. సాంగ్స్, ట్రైలర్స్ బాగున్నాయి. అన్నారు.

సంగీత దర్శకుడు సదాచంద్ర మాట్లాడుతూ…దర్శకుడు, నిర్మాత, నేను పని విషయంలో టామ్ అండ్ జెర్రీగా పనిచేశాం. టైటిల్ సాంగ్ చంద్రబోస్ గారు పాడారు. చంద్రబోస్ గారు అలా ట్యూన్ వినేసి, టైటిల్ సాంగ్ రాసిచ్చారు. చంద్రబోస్ గారు గురువు లాంటి వారు. ఆయన ఎంతో బిజీగా ఉన్నా పాట అసువుగా చెప్పి రాయించారు. ఆ పాట సినిమాలో హైలైట్ అవుతుంది. అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…దర్శకుడు కొత్త తరహా కథా కథనాలతో సినిమా చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉంటుందని అనుకుంటున్నా. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీకి మరింత కొత్త కంటెంట్ తో , న్యూ టాలెంట్ పరిచయం అవుతారు. అన్నారు.

రచ్చ రవి మాట్లాడుతూ….దర్శకుడు వెంకటరమణ నాకు ఫ్రెండ్స్. ఆయనతో మన్యం అనే సినిమా గతంలో చేశాను. ఈ సినిమాలో ఒక మంచి సీన్ చేయించుకున్నారు. తక్కువ నిడివి అయినా మంచి క్యారెక్టర్ చేశాను. క్రాక్ సినిమాలో కటారి కృష్ణ కూతురిగా మౌర్యాని నటించింది. విజయ్, మౌర్యాని లకు ఆల్ ద బెస్ట్. పాటలు, ట్రైలర్, మేకింగ్ చూస్తే సినిమా క్వాలిటీగా ఉందని తెలుస్తోంది. పాటలు బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఎంత కష్టపడితే స్టార్ అయ్యాడో, అంతే కష్టపడమని ఈ సినిమా హీరో విజయ్ కు సలహా ఇస్తున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఐజీ అల్లం కిషన్ రావు, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, రచ్చ రవి, లయన్ వీణా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

నాగినీడు, వెంకట గోవిందరావు, శివన్నారాయణ, కోటేశ్వరరావు, రచ్చరవి, సునీత, శిరిరాజ్, చలపతిరావు, సాయిమణి, సుభాష్ రెడ్డి నల్లమిల్లి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం – సదాచంద్ర, ఎడిటర్ – కేఏవై పాపారావు, పొటోగ్రఫీ – జి అమర్, సాహిత్యం – చంద్రబోస్, భాస్కరభట్ల, వనమాలి, కాసర్ల శ్యాం, మాటలు – వై సురేష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ – సంతోష్ ఎస్, ఆర్ట్ – వీఎన్ సాయిమణి, కొరియోగ్రఫీ – వీరస్వామి, ఫైట్స్ – అవినాష్, నిర్మాత – పడ్డాన మన్మథరావు, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం – వెంకటరమణ ఎస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *