క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన తర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్‌.. పుకార్ల‌ను న‌మ్మొద్దు: నిర్మాత‌లు

క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన తర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్‌.. పుకార్ల‌ను న‌మ్మొద్దు:  నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు 
గ‌త ఏడాది ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవా క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌టీన‌టుల‌పై వ‌స్తున్న పుకార్ల‌పై నిర్మాత‌లు స్పందించారు. 
నిర్మాత‌లు  జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ – ‘‘సాయితేజ్, దేవా కట్ట కాంబినేషన్‌లో మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభం కావాల్సింది. కానీ కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌న దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్ చేయ‌లేం. కాబ‌ట్టి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. అలాగే సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టుల గురించి కూడా సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అవ‌న్నీ అవాస్త‌వాలు. పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని మ‌న‌వి. సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను మేమే అధికారికంగా తెలియ‌జేస్తాం’’ అన్నారు.