డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా*
డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా*
చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలంటే క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ వంటి వీపీఎఫ్ ( వర్చువల్ ప్రింట్ ఫీ) ఖర్చులు భారంగా మారాయి. చిన్న చిత్రాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి సమస్యలను అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలని కోరుతూ ఆర్కే గౌడ్, దీక్ష మూవీ టీమ్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ వద్ద మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో ఆర్కే దీక్ష మూవీ దర్శక నిర్మాత, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణగౌడ్. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాతలు గురురాజ్, లయన్ సాయి వెంకట్, హీరో కిరణ్, షెరాజ్ మెహదీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – థియేటర్స్ గుత్తాధిపత్యం, వీపీఎఫ్ ఛార్జీల భారం తగ్గించాలని కోరుతూ ఈ రోజు మహాధర్నా చేస్తున్నాం. కొన్నేళ్ల కిందట ఈ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ వచ్చినప్పుడు ఉచితంగా ప్రదర్శించారు. ఆ తర్వాత ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఏడేళ్ల తర్వాత ఎలాంటి ఛార్జీలు ఉండవు అన్నారు. ఇప్పుడు పన్నెండేళ్లవుతున్నా ఆ ఛార్జీలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక చిన్న నిర్మాత తన సినిమా రిలీజ్ చేసుకోవాలంటే వీపీఎఫ్ ఛార్జీలు ఐదు నుంచి పది లక్షలు అవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి పక్క రాష్ట్రాల్లో 2, 3 వేలు ఉంటే మన దగ్గర పది నుంచి పదిహేను వేల రూపాయలు వారానికి వసూలు చేస్తున్నారు. సినిమా బాగా లేదంటూ రెండు మూడు రోజులకే సినిమా తీసేస్తున్నారు. మరి ఆ వారం రోజులకు కట్టించుకున్న ఛార్జీలు తిరిగి ఇవ్వడం లేదు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రమేష్ ప్రసాద్ వీళ్లంతా ఒక్కో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ తరుపున పనిచేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. రామానాయుడు దేవుడిలా ఇండస్ట్రీలో చిన్న , కొత్త వాళ్లను ఆదుకునేవారు. ఆయన కొడుకు సురేష్ బాబు ఇండస్ట్రీని పీడిస్తున్నాడు. ఫిలింఛాంబర్ లో పదవులు అనుభవిస్తూ ఇలా దోపిడీ ఎలా చేస్తున్నారు. ఇండస్ట్రీలో 90శాతం చిన్న సినిమాలే. పదిశాతం మాత్రమే పెద్ద సినిమాలు. చిన్న నిర్మాతలంతా కలిసి పోరాటం చేస్తే మీ జీవితం ఎలా ఉంటుందో చూసుకోండి. మా ఆర్కే దీక్ష సినిమా అన్ని చోట్ల బిజినెస్ అయ్యింది. నైజాంలో థియేటర్స్ ఇవ్వడం లేదు. మా ఒక్క సినిమానే కాదు ఎన్నో చిన్న చిత్రాలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. థియేటర్స్ మీదే గుత్తాధిపత్యం, ఇటు డిజిటల్ దోపిడీ చేస్తున్నారు. మల్టీప్లెక్సులు కట్టి అక్కడ టికెట్ రేట్స్ పెంచి, తినుబండారాల రేట్స్ పెంచి సినిమాకు ఆడియెన్స్ రాకుండా చేస్తున్నారు. అందుకే ఐ బొమ్మ రవికి కూడా ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లభించింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలి. డిజిటల్ ఛార్జీలు తగ్గించాలి. థియేటర్స్ అందరికీ ఇవ్వాలి. లేకుంటే ఈ పోరాటం తీవ్రరూపం దాల్చుతుంది అన్నారు.
నిర్మాత జేవీఆర్ మాట్లాడుతూ – ఆర్కే దీక్ష మూవీ టీమ్ చేస్తున్న మహాధర్నాకు మేమంతా మద్ధతు ప్రకటిస్తున్నాం. ఈ పోరాటం ఈ రోజుది కాదు. చిన్న నిర్మాతలు ఎంతోకాలంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీకి పెద్దలు అని చెప్పుకునే కొందరు గద్దల్లా మారి చిన్న నిర్మాతలను భక్షిస్తున్నారు. ఒక రామానాయుడు, ఒక దాసరి లాంటి వాళ్లు ఉన్న గొప్ప ఇండస్ట్రీ మనది. రామానాయుడు గారి కొడుకుగా సురేష్ బాబు మీద మాకు గౌరవం ఉంది. కానీ ఆయన తను బతుకుతున్న ఇండస్ట్రీని దోపిడీ చేస్తూ గొడ్డలి పెట్టు పెట్టినట్లు వ్యవహరిస్తున్నాడు. చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే దాకా ఇలాంటి పోరాటాలు మరిన్ని వస్తాయి అన్నారు.
నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ – చిన్న చిత్రాల మనుగడ టాలీవుడ్ లో కష్టంగా మారింది. చిన్న చిత్రాలను, చిన్న నిర్మాతలను ఎదగనీయడం లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరం తర్వాత కొత్త వాళ్లను సపోర్ట్ చేయకుంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఆ తరం వచ్చేదా. వాళ్లు సపోర్ట్ చేయకుంటే ఇప్పుడున్న హీరోల తరం ఉండేదా. ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. ఆడిన సినిమానే పెద్ద సినిమా. ఆర్కే దీక్ష సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదు, వీపీఎఫ్ ఛార్జీలు భారంగా మారాయి. అందుకే ఈ దీక్ష చేపట్టాం. చిన్న నిర్మాతలందరినీ ఏకం చేస్తాం. ఈ సమస్యలకు పరిష్కారాలు లభించేలా పోరాడతాం అన్నారు.
హీరో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమను కాపాడేవి చిన్న సినిమాలే. అలాంటి చిన్న సినిమా ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరకు సెన్సార్ దగ్గర కూడా చిన్న సినిమాకు న్యాయం జరగడం లేదు. వీపీఎఫ్ ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ఇండస్ట్రీ నుంచి ఆర్జిస్తున్నారు. వెయ్యి కోట్ల రూపాయల సినిమా అయినా, కోటి రూపాయల బడ్జెట్ మూవీ అయినా సమాన న్యాయం దక్కాలి అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ – నేను దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. బాల నటుడి నుంచి కెరీర్ కొనసాగిస్తున్నా. ఇప్పుడు ఆర్కే దీక్ష మూవీలో హీరోగా నటిస్తున్నా. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయకున్నా ఫర్వాలేదు. ఇలా థియేటర్స్ ఇవ్వకుండా డిజిటల్ ఛార్జీలు పెంచి, చిన్న సినిమా బయటకు రాకుండా చేస్తున్నారు. చిన్న సినిమాను చంపేస్తున్నారు. ఇలాంటి స్వార్థపరులపై పోరాటం చేస్తాం. మా రామకృష్ణ గౌడ్ గారి వెంట ఉండి ఎలాంటి ధర్నాలకైనా సిద్ధంగా ఉంటాం అన్నారు.
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు డిజిటల్ ఛార్జీలు వసూలు చేయరు. బాంబేలో చాలా తక్కువ. యష్ రాజ్ లాంటి సంస్థలకు ఫ్రీగా ఇస్తారు. మన దగ్గర ప్రింట్ నుంచి డిజిటల్ కు మారాలనుకున్నప్పుడు ఖర్చు తగ్గుతుంది అనుకుని ఇండస్ట్రీ అంతా ముందడుగు వేశాం. కానీ ఇప్పుడు ఆ డిజిటల్ ఛార్జీలే పెనుభారంగా మారుతాయని ఊహించలేదు. ఏడాదికి కొంత తగ్గించుకుంటూ వచ్చినా ఈ రోజుకు డిజిటల్ ఛార్జీలు మైనస్ లో ఉండాలి. కానీ పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. వీళ్లు చేస్తున్న పోరాటం మొత్తం ఇండస్ట్రీ కోసం. చిన్న సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. పది మందికి పని దొరుకుతుంది. అవార్డ్స్ గెలిచేవి, సమాజానికి మంచి చెప్పేవి చిన్న చిత్రాలే. అలాంటి చిన్న చిత్రాల కోసం డిజిటల్ ఖర్చుల భారం తగ్గించాలి. గతంలో ప్రభుత్వ నేతలకు చాలాసార్లు ఈ విషయం చెప్పాం. ఫిలింఛాంబర్ నుంచి కూడా ప్రయత్నం చేశాం. మల్టీప్లెక్సుల్లో కూడా తమిళనాడులా కింద తరగతి టికెట్ ఉండాలి. నేను వీళ్లకు పరిశ్రమ తరుపున సంఘీభావం తెలిపేందుకు వచ్చాను అన్నారు.
నిర్మాత లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – చిన్న సినిమా 200 థియేటర్స్ లో సినిమా వేసి డిజిటల్ ఛార్జీలు లక్షలాది రూపాయలు కట్టి మురిసిపోతుంటాడు. కానీ మరుసటి రోజుకే 90 శాతం థియేటర్స్ లో సినిమా తీసేస్తున్నారు. కానీ కట్టించుకున్న డిజిటల్ ఛార్జీలు తిరిగి ఇవ్వరు. ఇలా కోట్లాది రూపాయలు చిన్న నిర్మాతల సొమ్ము దోపిడీ చేస్తున్నారు. చిన్న నిర్మాత చావు బతుకుల్లో ఉన్నాడు. చిన్న సినిమాను కాపాడేందుకు ఇలాంటి మహాధర్నాలు జరగాలి. నిర్మాతలంతా ఒక్కటి కావాలి. రామకృష్ణ గౌడ్ గారి పోరాటానికి మేమంతా మద్ధతు ఇస్తున్నాం అన్నారు.

